Benefits of Running : పరుగు ఆరోగ్యానికి అత్యంత ప్రధానమైనది. ఈ పరుగే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కీలకం. నిపుణులు వారంలో కనీసం రెండున్నర గంటలైనా వ్యాయామం చేయాలని చెబుతారు. ఈ వ్యాయామంలో పరుగే అతి ముఖ్యమైనదని స్పష్టం చేస్తారు. ఈ పరుగుతోనే అనారోగ్యం తరిమికొట్టేయొచ్చు. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. ఆఖరికి కొన్ని శాఖల్లో కొలువులను కూడా సంపాదించొచ్చు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలిలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా పరుగు పెట్టాల్సిందే! ఆహార అలవాట్లతో అనేక సమస్యలు వస్తాయి. వాటిని ఒంటికి దరి చేరకుండా ఉండాలంటే పరుగు ప్రధాన ఆయుధం. నేడు పరుగు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం.
ప్రస్తుత ఆధునిక కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ ఫోన్లకు అతుక్కుని పోతున్నారు. ఇదే కాకుండా ఇంట్లోవారు షాపునకు వెళ్లి ఏదైనా వస్తువు తెమ్మని చెబితే బైక్‌పై వెళుతున్నారు. మరికొంత మంది ఉదయం 9 అయ్యే వరకు పడుకుంటారు. ఇప్పుడు ఈ అలవాట్లే మీకు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా గుండె సమస్యలు, చర్మ సమస్యలు, క్యాన్సర్, అధిక బరువు, రక్తపోటు, చక్కెర వంటి సమస్యలను ఫ్రీగా కొని తెచ్చిపెడుతున్నాయి.
ఈ సమస్యలు అన్నీ మన శరీరం నుంచి బయటకు పోవాలంటే ఒకే ఒక ఆయుధం పరుగు మాత్రమే. పరుగుతోనే ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలైనా పటాపంచలైపోతాయి. కాసేపు ఫోన్‌ను పక్కన పెట్టి మైదానంలోనో, రోడ్డు మీదో, ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర కనీసం 20 నిమిషాలు పరుగు తీస్తే చాలు. భవిష్యత్తు అంధకారం కాకుండా ఉంటుంది. సాధారణ వ్యక్తి రోజుకు కనీసం 5 నిమిషాల పరుగుతో ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చు. కానీ కేలరీలు భారీగా కరగాలంటే మాత్రం నిత్యం 20 నిమిషాల పరుగు ఉండాల్సిందే.
ఉద్యోగానికి కూడా పరుగు అవసరం : రక్షణ దళంలో ఉద్యోగాల సాధనకు పరుగు భాగమే. అథ్లెటిక్స్‌లో సైతం పరుగు ప్రధానం. క్రీడా కోటాలో కొలువుల సాధనకు, ఉన్నత విద్యలో ప్రవేశాలకు సైతం పరుగే ఉపకరిస్తోంది.
పరుగుతో ప్రయోజనాలెన్నో తెలుసా :
- మెదడుకు తగిన ప్రాణ వాయువు అందుతుంది.
- పరుగుతో శరీరంతో పాటు మెదడూ ఉత్సాహంగా స్పందిస్తుంది.
- కండరాల సాంద్రత పెరుగుతుంది.
- వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది.
- సూర్య కిరణాలు, ప్రకృతి, చల్లటి వాతావరణం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయి.
- మహిళలకు భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.
- అధిక బరువు, రక్తపోటు, చక్కెర తగ్గవచ్చు.
- గుండె జబ్బులు నుంచి పూర్తిస్థాయిలో రక్షణ పొందవచ్చు.
- ఒంట్లోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించవచ్చు.