Electric GO Cart Racing Car : సాధారణంగా రేసింగ్ కార్ల కోసం ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ ఇంధన వినియోగం వల్ల వెలువడే కాలుష్యం కూడా ఎక్కువే. అందుకే గో-కార్డ్ కార్లలో ఇంధన వినియోగం, వెలువడే కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్ధులు తయారు చేసిన ఎలక్ట్రిక్ గో- కార్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగం సెమిస్టర్-5లో 'మీరు ఏం నేర్చుకున్నారు?' అనే అంశంపై ఆరుగురు విద్యార్ధులు వినూత్నంగా ఆలోచించి ఎలక్ట్రిక్ గో-కార్ట్(Electric Go Cart Car) ప్రాజెక్టు రూపొందించారు. సీనియర్ అధ్యాపకుడు కార్తీక్ కుమార్ నేతృత్వంలో తయారు చేశారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన సృజన టెక్ ఫెస్ట్‌లో ఈ ప్రయోగం ప్రథమ బహుమతి సాధించింది. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సృజన టెక్‌ఫెస్ట్-2024కు ఎంపికైంది. రేసింగ్ కారు తయారీకి లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటిది ఈ కారును అత్యంత చౌకగా కేవలం రూ.32 వేలకే సృష్టించడం విశేషం.
కోడి ఈకలతో పర్యావరణ హిత ప్లాస్టిక్- ఎరువుగా కూడా వాడుకోవచ్చట!
Srujana Tech Fest-2024 in MahabubNagar : ప్రాజెక్టులో భాగంగా పాలిటెక్నిక్ విద్యార్ధుల ఇంకేదైనా ప్రయోగం చేసే అవకాశం ఉన్నా రేసింగ్‌పై ఆసక్తి ఉండటంతో గో-కార్డ్‌ను వినూత్నంగా ప్రయోగాత్మకంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. హైబ్రీడ్ రకాలున్నా ఎలక్ట్రిక్ వాహనమైతే కాలుష్యం సహా ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చని ఆలోచించారు. విడిభాగాల ఎంపికలోనూ కొత్తగా ఆలోచించారు. వాహన చక్రాల కోసం స్పోర్ట్స్ సైకిల్(Sports Cycle) వీల్స్‌ని ఎంచుకున్నారు. వేగంగా వెళ్లాలంటే వాహనం బరువు ఉండకూడదని అందుకోసం తేలికైన, తుప్పుపట్టని, ఎండకు, వానకు సంకోచ వ్యాకోచాలకు గురికాని స్టీల్ బాడీని తయారు చేశారు. మంచి పనితీరు చూపించే డీసీ మోటార్, తేలిగ్గా ఉండి, ఎక్కువ విద్యుత్‌ను నిల్వచేసుకునే లిథియం బ్యాటరీ, కంట్రోలర్, సోలార్ ప్యానల్, ఆల్టర్‌నేటర్‌ను ఉపయోగించారు.
'జల సంస్కారం'... నీటి తొట్టెలోనే అంత్యక్రియలు.. ఇది పర్యావరణ హితం!
"గోకార్డ్‌ను పిల్లలు, వృద్ధులు, వికలాంగులు కూడా వినియోగించుకోవచ్చు. ప్రాజెక్టులో భాగంగా మేము తయారు చేసింది ప్రయోగాత్మక నమూనా మాత్రమే. తగిన ప్రోత్సాహం అందింతే మరిన్ని ప్రయోగాలకు ప్రారంభిస్తాం. మేము రూపొందించిన వాహనంతో కాలుష్యానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇలాంటి వాహనాలకు భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందని అనుకుంటున్నాం."- విద్యార్థులు
GO Cart Racing Car Rate : లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జింగ్‌కు 3 గంటల సమయం పడుతోంది. గంటకు 20- 30 కిలో మీటర్ల వేగంతో గోకార్డ్ ప్రయాణిస్తుంది. 100 కిలోల బరువును లాగుతుంది. పూర్తి ఛార్జింగ్‌తో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని విద్యార్థులు తెలిపారు. పూరిస్థాయి బ్యాటరీ ఛార్జింగ్‌కు ఒక యూనిట్ కరెంట్ సరిపోతోందన్నారు. రూ.4లకే 30 కిలోమీటర్లు వెళ్లవచ్చని పేర్కొన్నారు. బ్యాటరీ వాడకంలో లేకపోయినా, డిశ్ఛార్జి కాకపోవడం విశేషం. చక్రాలకు అమర్చిన సోలార్ ప్యానళ్ల నుంచి బ్యాటరీ చార్జ్ అయ్యేలా దీన్ని తయారు చేశారు. బ్యాటరీలో ఇంధనం లేకపోయినా సోలార్ ప్యానళ్ల(Solar Panels) ద్వారా వచ్చే విద్యుత్‌తో మరో 3 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపారు.