EC Bans Former CM KCR From Election Campaign : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్‌పై ఈసీ ఈ విధంగా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నిషేధం విధించింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసీఆర్‌పై చర్యలకు ఈసీ పూనుకుంది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ ఫిర్యాదు చేశారు.
ఈసీకి కేసీఆర్ ఇచ్చిన వివరణ : ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఈసీ కేసీఆర్ సమాధానం కోరింది. దీనికి గులాబీ బాస్ వివరణ ఇచ్చారు. తన మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదన్నారు. స్థానిక మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదని, వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ట్విస్ట్ చేశారన్నారు. తాను కేవలం కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించానని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల సంఘం 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయొద్దని నిషేధం విధించింది.
నిషేధంపై ఎన్నికల సంఘం వివరణ : కేసీఆర్ ఇచ్చిన వివరణపై ఈసీ సంతృప్తిని చెందలేదు. సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ స్పష్టం చేసింది. గతంలోనూ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ తెలిపింది. పార్టీ అధినేతగా, స్టార్ క్యాంపెయినర్‌గా కేసీఆర్ ఎన్నికల నియమావళిని పాటించి ఇతర నేతలకు ఆదర్శంగా నిలవాలని సూచించింది. అందుకే 48 గంటల పాటు బహిరంగసభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, మీడియాతో మాట్లాడరాదని నిషేధం విధించింది. ఈ నిషేధ ఆదేశాలు ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుంచి 48 గంటల పాటు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ 48 గంటలు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది.
కేటీఆర్ ట్వీట్ : ఏకంగా తెలంగాణ అవాజ్ కేసీఆర్ గొంతు పైనే నిషేధమా? అంటూ ఇదెక్కడి అరాచకం అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? మోదీ ప్రసంగాలపై వేల ఫిర్యాదులు వచ్చినా చర్యల్లేవు అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? విరుచుకుపడ్డారు. బడే భాయ్, చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కేసీఆర్ పోరు బాట కార్యక్రమం చూసి ఎందుకు కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వణికిపోతున్నారని ప్రశ్నించారు. అందుకే మీ అహంకారానికి, సంస్థాగత దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు - కేసీఆర్‌పై ఫిర్యాదు నమోదు - Telangana Phone Tapping Case
జైలుకు వెళ్లేందుకు నేను ఎన్నడూ భయపడలేదు : కేసీఆర్ - KCR BUS Yatra In Telangana