Pawan Kalyan Visit Gurla : ఏపీలోని విజయనగరం జిల్లాలో గుర్లలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. నెల్లిమర్ల మండలం ఎస్.ఎస్.ఆర్.పేట వద్ద గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించారు. అనంతరం గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయేరియా బాధితులను పవన్ కల్యాణ్ పరామర్శించారు. గుర్లలో గ్రామస్థులతో డిప్యూటీ సీఎం పవన్ ముఖాముఖి నిర్వహించారు.
మృతుల కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం: గ్రామస్థులు 3 ప్రధాన సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి ట్యాంకులు ఎక్కువ రోజులు శుభ్రపరచడంలేదని, ఒకే ఒక్క ట్యాంకు వల్ల తాగునీటి సమస్య తలెత్తుతోందని గ్రామస్థులు ఆరోపించారు. సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వినతి పత్రాలు అందజేశారు. అదే విధంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షను నిర్వహించారు. అతిసారం వ్యాప్తి, కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తన తరఫున మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
విచారణకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విజయానంద్: ఘటనపై నివేదిక వచ్చాక ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని పవన్ భరోసానిచ్చారు. గత ప్రభుత్వ తప్పిదాలు వారసత్వంగా వచ్చాయని, గుర్లకు వెళ్లే చంపావతి నీరే కలుషితమైందని అన్నారు. గత ప్రభుత్వం కనీసం మంచినీరు అందించలేకపోయిందన్న పవన్, విచారణకు సీనియర్ ఐఏఎస్ విజయానంద్‌ను నియమించారు. విచారణ తర్వాత ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
Pawan Kalyan Rushikonda Visit : తిరుగు ప్రయాణంలో విశాఖలోని రుషికొండ భవనాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకస్మికంగా పరిశీలించారు. విజయనగరం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రుషికొండ భవనాలను పరిశీలించేందుకు వచ్చారు. పవన్ కల్యాణ్ వెంట జనసేన నేతలు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఉన్నారు. పరిశీలన అనంతరం విశాఖ విమానాశ్రయానికి పవన్ కల్యాణ్ బయలుదేరి వెళ్లారు.
"గత ప్రభుత్వ తప్పిదాలు మాకు వారసత్వంగా వచ్చాయి. గుర్లకు వెళ్లే చంపావతి నీరే కలుషితమైంది. గత ప్రభుత్వం కనీసం మంచినీరు అందించలేకపోయింది. విచారణకు సీనియర్ ఐఏఎస్ విజయానంద్‌ను నియమించారు. విచారణ తర్వాత ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటిస్తాం. నా తరఫున మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రకటిస్తున్నా" -పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం