Drugs Supply in Hyderabad : రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకున్నా దందా మాత్రం ఆగడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం ఏదో విధంగా నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తూ విక్రయిస్తూనే ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా వేర్వేరు మార్గాలను ఆలోచిస్తున్నారు. తాజాగా తమ ఆనవాళ్లు గుర్తించకుండా డెడ్‌డ్రాప్ పద్ధతిలో సింథటిక్ డ్రగ్స్ చేరవేస్తున్నారు. వాట్సాప్‌లో లొకేషన్ పంపితే చాలు గమ్యానికి డ్రగ్స్ చేరుతాయి.
డెడ్‌డ్రాప్ పద్ధతిలో సింథటిక్ డ్రగ్స్ : డెడ్‌డ్రాప్ పద్ధతిలో సింథటిక్ డ్రగ్స్ చేరవేస్తున్న అంతర్జాతీయ ముఠాలోని ఒక విదేశీయుడు సహా ముగ్గురిని హెచ్‌న్యూ, హుమూయున్‌నగర్ పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ.20.75 లక్షల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో హెచ్‌న్యూ డీసీపీ సుదీంద్ర, ఇన్‌స్పెక్టర్లు డానియేల్, శ్రీనివాస్, శేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటరాములుతో కలసి సీపీ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు.
వాట్సాప్ గ్రూపుల ద్వారా లావాదేవీలు : సూడాన్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్ ఉస్మాన్ అలియాస్ హనిన్(24) 2016లో విద్యార్థి వీసాపై భారత్‌కు వచ్చాడు. మెహిదీపట్నంలోని అప్టిక్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాదిపాటు ఇంగ్లీషు కోర్సు నేర్చుకొని 2017లో స్వదేశానికి వెళ్లాడు. యూపీలోని ఓ యూనివర్సిటీలో మూడేళ్ల బీసీఏ కోర్సులో చేరి పలుమార్లు స్వదేశానికి వెళ్లి మళ్లీ వచ్చి కోర్సు పూర్తిచేశాడు. ఈ సంవత్సరం జులైలో టోలిచౌకికి మకాం మార్చాడు.
డ్రగ్స్ స్మగ్లింగ్ వృత్తిగా మలచుకొని నైజీరియన్లు, టాంజానియన్లు, సూడాన్, పాలస్తీనియన్లతో పరిచయాలు పెంచుకున్నాడు. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌తో సంబంధాలున్న వారి దగ్గర తక్కువ ధరకు సింథటిక్ డ్రగ్స్ కొని సరఫరా ప్రారంభించాడు. డార్క్‌వెబ్, సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. కొనుగోలుదారుల నుంచి డబ్బు ఖాతాలో పడగానే వారికి డ్రగ్స్ ఉంచిన ప్రాంతం ఫొటో, లొకేషన్ పంపిస్తారు. దీనినే డెడ్‌డ్రాప్ పద్ధతి అంటారు. ఈ విధానంలోనే హనిన్ గ్యాంగ్ డ్రగ్స్ చేరవేసేది.
నైజీరియన్లతో పరిచయాలు ఏర్పరుచుకొని : మరో నిందితుడైన ఇమ్రాన్ అలియాస్ షకూర్(29) బంజారాహిల్స్ నివాసముంటున్నాడు. ఐదో తరగతిలోనే గంజాయికి అలవాటై చదువు మానేశాడు. పలుచోట్ల పనికి కుదిర్చినా మత్తుకు బానిసై ఉండలేకపోయాడు. ఆ తర్వాత పంజాగుట్టలోని ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బెంగళూరులోని నైజీరియన్ చుక్వా ఒబెయ, కేరళకు చెందిన నందకుమార్(25) ద్వారా సింథటిక్ డ్రగ్స్ కొని నగరంలో విక్రయించసాగాడు. చందానగర్‌కు చెందిన కె.నవీన్(24) సహాయంతో డెడ్‌డ్రాప్ పద్ధతిలో డ్రగ్స్ తరలిస్తున్నాడు. గత ఫిబ్రవరిలో ఇమ్రాన్‌ను నాంపల్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. అతని ఫోన్‌లో 11 మంది కొనుగోలుదారులను గుర్తించారు.
బల్బులో డ్రగ్స్ - బెంగళూరు టు హైదరాబాద్ వయా గుంటూరు
భద్రాద్రి కొత్తగూడెంలో డ్రగ్స్ ముఠా అరెస్ట్ - రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం