Drone Videography in Telangana : ఏవైనా కార్యక్రమాలు ఘనంగా జరిగితే సంబరాలు అంబరాన్నంటాయని చెబుతుంటారు. ప్రస్తుతం డ్రోన్లు, డ్రోన్ కెమెరాలు నిజంగానే చేసి చూపిస్తున్నాయి. జీవితంలో ప్రతి వేడుకను ఓ మధుర జ్ఞాపకంగా మలచుకోవాలని అందరూ కోరుకుంటారు. అందులో భాగంగానే ఫొటోలు, వీడియోలు, విందులు, వినోదాలు చేసుకుంటారు. తాజాగా ఆ జాబితాలో కొత్తగా డ్రోన్ వీడియోగ్రఫీ చేరింది. ఈ మధ్య హైదరాబాద్ సహా నగరాలు, పట్టణాల్లో జరిగే చాలా వేడుకల్లో డ్రోన్ తప్పనిసరిగా వాడుతున్నారు.
ఖర్చు ఎంతైనా కూడా వీటిని వినియోగిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ట్రావెల్ వ్లాగర్లు, యూట్యూబర్లు తమ చిత్రీకరణల్లో డ్రోన్ షాట్లను భాగం చేస్తున్నారు. మరోవైపు పోలీసులకు నిఘా అస్త్రంగానూ డ్రోన్ ఉపయోగపడుతోంది. ర్యాలీలు, ఉత్సవాల్లో వీటి సాయంతోనే ఆకతాయిలు, సంఘ విద్రోహశక్తులు చొరబడకుండా అప్రమత్తత వహిస్తున్నారు.
నగరంలో జోరందుకుంటున్న వినియోగం : గతేడాది అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవంలో 800 డ్రోన్లతో హైదరాబాద్‌లో తొలిసారి ప్రదర్శన ఇచ్చారు. తర్వాత దుర్గం చెరువు వద్ద, పోలీస్ అకాడమీ, వింగ్స్ ఇండియా 2024 లో చేపట్టిన డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలు డ్రోన్లను నిర్వహిస్తున్నాయి. సాధారణ వీడియోగ్రాఫర్లు వీటిని వినియోగించడానికి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
వివాహాల చిత్రీకరణకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ధరలను ఉంచుతున్నారు. వ్యక్తిగత డ్రోన్ల ఖరీదు రూ.45 వేల- రూ.లక్ష వరకు ఉన్నాయి. వేడుకలకు సంబంధించి రూ.1 లక్ష 50 వేల నుంచి రూ.3 లక్షలు, సినిమాలకు వినియోగించేవి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటాయని డ్రోనికా ఇన్నొవేషన్స్ నిర్వాహకులు అశోక్ తెలిపారు.
వందల డ్రోన్లు ఒకచోటకు చేరి : ఇంటి శుభకార్యాలతో పాటు ఊర్లలో జాతరలు, పండగల్లోనూ డ్రోన్ వీడియోగ్రఫీ భాగమైంది. వివాహాలు, పుట్టినరోజులు ఇతర వేడుకల్లో దీని కోసం రూ.లక్షల ఖర్చు వెచ్చిస్తున్నారు. కొందరు యువకులు తమ గ్రామం అందాలను అందరికీ తెలిపేలా డ్రోన్‌లతో వీడియో డాక్యుమెంటరీలు చిత్రీకరిస్తున్నారు. ఏరియల్ వ్యూలో తమ ఊరి పచ్చటి పైరులు, అందాలను చూసి స్థానికులతోపాటు దేశ విదేశాల్లో స్థిరపడ్డ గ్రామస్థులు సంతోషపడుతున్నారు.
ప్రభుత్వ, కార్పొరేట్ కార్యక్రమాల్లో 200 నుంచి 1000కి పైగా డ్రోన్‌లతో ప్రదర్శనలు చేయడం ప్రస్తుతం నయా ట్రెండ్‌గా మారింది. వందలాది డ్రోన్‌లు ఒక చోటుకు చేరి నిర్దిష్ట రూపాన్ని సంతరించుకోవడం అందరినీ అబ్బురపరుస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు కొత్తగా తమ లోగో ఆవిష్కరణకు, ప్రమోషన్ల కోసం 5 నిమిషాల నిడివి ఉన్న ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి. ముందుగానే ప్రదర్శించాల్సిన డిజైన్లు, స్టోరీ, యానిమేషన్‌లపై ప్రోగ్రామింగ్ చేసి రియల్ టైం కైనమేటిక్ (ఆర్టీకే) బేస్‌స్టేషన్‌కి అనుసంధానిస్తారు. అనంతరం కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చేస్తూ ప్రదర్శన ఇస్తారు. డ్రోన్‌లకు అమర్చిన ఆర్‌జీబీ లైట్స్ వెలుగుతు కాంతి ప్రసరింపజేస్తాయి.
దేశంలో ఊపందుకుంటున్న డ్రోన్ల పరిశ్రమ
Rana inaugurated marut drones: 'డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లడం శుభ పరిణామం'