Doctors Advice about Food Stuck in Throat : చిన్న పిల్లలు ఆడుకుంటూ తమ చేతిలు ఉన్న వస్తువులను నోట్లో పెట్టుకోవడం సాధారణం. ఒక్కోసారి ఆ వస్తువులు పొరపాటున మింగడంతోపాటు గొంతు, ఆహార నాళాల్లో ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు విడిచిన ఘటనలు సైతం ఉన్నాయి. గొంతులో ఆహార పదార్థాలు ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలో తెలియక, సరైన అవగాహన లేక పలువురు సమస్యను జటిలం చేసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతినెల దాదాపు 30 మందికిపైగా గొంతు, నాళాల్లో పదార్థాలు, వస్తువులు ఇరుక్కుని ఆసుపత్రిలో చేరుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- గొంతులో ఇరుక్కునేలా ఉండే నాణేలు, వస్తులు పిల్లలకు ఇవ్వకూడదు.
- ఆహార నాళాల్లో అల్సర్లకు దారి తీసే అయస్కాంతం, బ్యాటరీలు, పిన్నీసులు సైతం చిన్నారులకు దూరంగా ఉంచాలి.
- మాంసాహారంతో పాటు గట్టిగా ఉండే పదార్థాలను మెత్తగా నమలాలి.
- క్యారెట్ వంటి ఆహార పదార్థాలను కట్చేసి పిల్లలకు ఇవ్వాలి.
- చిన్నారుల మెడలో సన్నటి గొలుసులు, నెక్లెస్ వేయకూడదు.
- పిల్లల గొంతులో పొరపాటున ఏదైనా ఇరుక్కుపోతే పొట్టపై రుద్దకూడదు. అలా చేస్తే పొట్ట లోపల గాయాలు కావొచ్చు.
- గొంతులో ఏమైనా ఇరుక్కుపోయినట్లు ఉంటే తలపై తట్టకూడదు.
- గొంతులో ఏదైనా ఇరుక్కున్నప్పుడు గట్టిగా దగ్గడం వల్ల లోపల ఉన్న వస్తువులు బయటపడే అవకాశం ఉంటుంది.
'పిల్లలు, పెద్దల గొంతు, ఆహార నాళాల్లో ఏదైనా ఇరుక్కుపోయిందని గమనించిన వెంటనే బలవంతంగా తీసేలా ప్రయత్నించకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. గొంతులో ఇరుక్కుపోయిన వస్తువుల స్థితిని గమనించి సూక్ష్మ పరికరాలతో జాగ్రత్తగా బయటకు తీయడమా లేదా పొట్టలోకి నెట్టడమా చేస్తాం. గత నెలలోనే నలుగురికి ఆధునిక చికిత్స ద్వారా గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను బయటకు తీశాం'- డాక్టర్ మువ్వ శ్రీహర్ష, గ్యాస్ట్రో ఇంటస్టైనల్ సర్జన్, మిర్యాలగూడ
ఘటనలు ఇలా
- రెండేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా రాజానాయక్ తండాలో ఓ వ్యక్తి గొంతులో మేక మాంసం ఎముక ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయారు.
- యాదాద్రి భువనగిరి జిల్లా కక్కిరేణి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడికి దంతాలు లేక నమలకుండానే మాంసం ముక్క మింగారు. దీంతో వైద్యుల అతికష్టం మీద శస్త్రచికిత్స చేసి మాంసం ముక్కను బయటకు తీశారు.
- గుర్రంపోడుకు చెందిన ఓ మహిళ నాటు మందు మిగుతుండగా అది కాస్త గొంతులో అడ్డుపడింది. దీంతో నీరు తాగడంతో మరింత ఉబ్బిపోయింది. ఎండోస్కోపీ ద్వారా మందుముద్దను వైద్యులు ముక్కలుగా చేసి పొట్టలోకి తోశారు.
- పెద్దవూర మండలానికి చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు గత నెలలో రెండు రూపాయల నాణేన్ని మింగడంతో మిర్యాలగూడలో ఆధునిక చికిత్స విధానంతో బయటకు తీశారు.