ADILABAD POST OFFICE SCAM STORY : ఆరుగాలం శ్రమించి పండించిన రైతన్నల రెక్కల కష్టంపై ఆ అధికారి కన్నుపడింది. తమకు సాయం చేస్తానని నమ్మించి, రైతులను నిండా ముంచే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనపై వరుసగా కథనాలు రావడంతో పోస్టాఫీసు అధికారి కటకటాలపాలవడంతో పాటు, రైతులకు వారి కష్టార్జితం తిరిగి మళ్లీ దక్కింది. అధికారుల దృష్టికి తీసుకొచ్చి తమ డబ్బులు తమకు వచ్చేలా కథనాలు ప్రచురించిన ఈటీవీ భారత్- ఈనాడుకు కర్షకులు ధన్యవాదాలు తెలిపారు.
అసలెేం జరిగిందంటే.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు పత్తి రైతులు, తాము పండించిన పంటను సీసీఐకి విక్రయించారు. పత్తి డబ్బులు తపాలాశాఖ ఖాతాల్లో జమయ్యాయి. పోస్టాఫీసు ఖాతా నుంచి రోజుకు పదివేలకు మించి తీసుకునే అవకాశం లేకపోవడంతో జమయ్యిన డబ్బులను, ఇతర బ్యాంకు పొదుపు ఖాతాల్లో ట్రాన్సఫర్ చేయాలని హెడ్‌పోస్టాఫీసులోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అధికారి విజయ్‌జాదవ్‌ని సంప్రదించారు.
రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న సదరు అధికారి రైతుల పోస్టాఫీసు ఖాతాలో జమైన డబ్బులను, వారు సూచించిన ఖాతాల్లోకి కాకుండా.. ఓటీపీ, బయోమెట్రిక్‌ల ద్వారా తన సొంత ఖాతాలోకి నిధులు మళ్లించుకుని డబ్బులు స్వాహాచేశాడు. ఈ వ్యవహారాన్ని ఈటీవీ భారత్- ఈనాడు ద్వారా బయటకు రావడంతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం దర్యాప్తుకు ఆదేశించారు. సదరు అధికారిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్‌శంకర్, అధికారులు దిల్లీ స్థాయిలో మంతనాలు జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూశారు. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన 78 మంది రైతులను తపాలా కార్యాలయానికి పిలిపించిన అధికారులు, వారికి రూ. కోటి 15లక్షలు నగదు రూపంలో చెల్లించారు. రైతులు అటు అధికారులకు, ఇటు ఈటీవీ భారత్, ఈనాడు చొరవను కొనియాడారు.
"మా ఆరునెలల కష్టార్జితం డబ్బులు మళ్లీ మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు డబ్బులు రావాడనికి కృషి చేసిన కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాము. ఈ ఘటనను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఈటీవీ భారత్- ఈనాడు, ఇతర మీడియాకు సంస్థలకు ధన్యవాదాలు". - అల్లూరి ఉమాకాంత్‌రెడ్డి, రైతు, కాప్రి, జైనథ్ మండలం
"పోస్టల్ అధికారి రైతులను మోసం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే చర్యలకు ఉపక్రమించాము. మోసం చేసిన అధికారిపై చర్యలు తీసుకున్నాము. దిల్లీలో పోస్టలో అధికారులతో మాట్లాడి రైతులకు డబ్బులు వచ్చేలా చేశాము. ఇవాళ ఆదిలాబాద్‌లో డబ్బులు పంపిణీ చేశాము". - రాజర్షిషా, కలెక్టర్, ఆదిలాబాద్‌జిల్లా
ఖరీఫ్ సీజన్‌పైనే రైతుల ఆశలు - ఈసారైనా పంటలు బాగా పండాలని ఆకాంక్ష - KHARIF SEASON CULTIVATION
రైతులకు గుడ్ న్యూస్ - త్వరలో కొత్త వ్యవసాయ పంట బీమా పథకం అమలు - Crop Insurance in Telangana