Dilraju on Allu Arjun Issue : తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారిగా స్పందించారు. ఇవాళ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. అనంతరం సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజులు అమెరికాలో ఉన్నందున రాలేకపోయానని తెలిపారు. అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లు తెలిపారు. అల్లు అర్జున్‌ను కూడా త్వరలో కలుస్తానని చెప్పారు.
ప్రభుత్వానికి, చిత్రపరిశ్రమకు మధ్య వారధిగా ఉంటా : సంధ్య థియేటర్ ఘటన ఎవరూ కావాలని చేసింది కాదని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అది దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండే బాధ‌్యత తనదే అని తెలిపారు. రేవతి భర్త భాస్కర్‌కు ఉపాధి కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రభుత్వం చిత్ర పరిశ్రమను దూరం పెడుతుందనేది దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. పరిశ్రమకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. ఒకట్రెండు రోజుల్లో సినీ ప్రముఖులతో సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. తాను ప్రభుత్వానికి, చిత్రపరిశ్రమకు మధ్య వారధిగా ఉంటానని దిల్ రాజు చెప్పారు. ఎలాంటి సమస్యలు రాకుండా చూసే బాధ్యత తనపై ఉందన్నారు. సీఎంతో మాట్లాడారని, తర్వాత అల్లు అర్జున్‌ని కలిసి మాట్లాడుతానని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.
"భాస్కర్ కుటుంబానికి ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకునే బాధ్యత నాది. అలాగే తనకి ముందుగా శ్రీతేజ్ రికవర్ అయ్యాక వాళ్లు కుటుంబానికి ఏం కావాలో అది చేస్తాను. ఇండస్ట్రీకి ఏం కావాలన్నా ప్రభుత్వం అందిస్తుందని సీఎం అన్నారు. అలాగే రెండు రోజుల్లో ఆయన్ను కలవాడానికి అపాయింట్‌మెంట్ ఇస్తానన్నారు. అందరం కలిసి మాట్లాడుతాం. ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా చూసే బాధ్యత సీఎం నాకు ఇచ్చారు. రెండింటి మధ్య వారధిలాగా ఉంటాను. " - దిల్‌రాజు, టీఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత
చిక్కడపల్లి పీఎస్‌లో ముగిసిన హీరో అల్లు అర్జున్ విచారణ
అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు - దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త!