Liquor Sales Starts in AP : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం దుకాణాలు బుధవారం (అక్టోబర్ 16) నుంచి మొదలయ్యాయి. వాటిలో డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఊరు పేరు లేని మద్యం ప్రజలకు అంటగట్టగా, ఇప్పుడు బ్రాండెడ్ సరకు వచ్చింది. బుధవారం విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో కొత్తగా దుకాణం ప్రారంభమైంది. దీంతో వెంటనే అధిక సంఖ్యలో వచ్చిన కొనుగోలుదారులు సెల్‌ఫోన్‌తో డబ్బులు చెల్లించి, నచ్చిన బ్రాండెడ్ సీసా తీసుకెళ్తూ కనిపించారు.
ఏపీలో బుధవారం నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల విక్రయాలు స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తి కావడంతో కొత్త ప్రాంగణాల్లో బుధవారం నుంచే నిర్వాహకులు వ్యాపారం మొదలుపెట్టారు. వారంతా తొలి విడత లైసెన్సు రుసుముల కింద ప్రభుత్వానికి రూ.330 కోట్లు చెల్లించారు. మద్యం షాపుల లైసెన్సుదారులు వారం రోజులకు సరిపడా నిల్వల కోసం ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆర్డర్లు పెట్టారు. వాటి విలువ సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఉంది.
'మాకు షేర్ ఇవ్వండి - లేదా పోటీ నుంచి తప్పుకోండి' - Wine Shop Tenders 2024
మద్యం ఆర్డర్ల కోసం ఎక్సైజ్ శాఖ లైసెన్సీలకు ప్రత్యేకంగా పోర్టల్‌లో లాగిన్ ఐడీలు ఇచ్చింది. వైఎస్సార్సీపీ హయాంలో గత ఐదేళ్లుగా కొనసాగిన ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళవారంతో గడువు ముగిసింది. వాటన్నింటినీ మూసివేసిన ఎక్సైజ్ అధికారులు, ఆయా దుకాణాల్లోని మిగిలిన స్టాక్, ఇతర వస్తువుల వివరాలన్నింటితో ఇన్వెంటరీ సిద్ధం చేశారు. బుధవారం ఆ స్టాక్‌ను డిపోలకు, వస్తువులను స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లకు తరలించారు.
నాడు కేవలం జే బ్రాండే : గతంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం ‘జే బ్రాండ్ల’ మద్యం మాత్రమే విక్రయించేవారు. వినియోగదారులు కోరుకున్న రకాలేవీ దొరికేవి కాదు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లన్నీ కనుమరుగు చేశారు. తాజాగా మద్యం వ్యాపారం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లినందున వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులోకి వచ్చాయి. లైసెన్సుదారులు ఆర్డర్లు పెట్టిన రకాలనే సరఫరా చేసేందుకు ప్రభత్వ ఆధ్వర్యంలోని ఏపీఎస్‌బీసీఎల్ సిద్ధమవుతోంది. దేశంలో ప్రధానంగా లభించే అన్ని బ్రాండ్లను వారం రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. రూ.99కే క్వార్టర్ మద్యం విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, నాలుగు నేషనల్ కంపెనీలు ఆ ధరలో అందించేందుకు సిద్ధమయ్యాయి. అవి మరో రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
ఏపీ మద్యం పాలసీ ట్విస్ట్‌లు - మంత్రి నారాయణ 100 దరఖాస్తులు చేస్తే ఎన్ని వచ్చాయో తెలుసా?
దసరాకు ఈ ప్రతిజ్ఞ చేద్దాం - వాహనదారులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి