TGSTRC Focus On Digital Payments : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఇక నుంచి చిల్లర కష్టాలు తీరనున్నాయి. కండక్టర్, ప్రయాణికులకు మధ్య చిల్లర సమస్య వివాదానికి కారణమవుతోంది. ఈ సమస్యను తీర్చేందుకు పూర్తి స్థాయిలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియకు సంస్థ సిద్ధమైంది. ఇందుకు సంబంధించి బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్ డిపోల్లోని 140 బస్సుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన డిజిటల్ చెల్లింపుల ప్రక్రియకు విశేష స్పందన వచ్చింది. దీంతో రానున్న రెండు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని బస్సు డిపోల్లోనూ డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
అవసరమైన మేరకు ఇంటెలిజెంట్ టికెటింగ్ యంత్రాల (ఐటిమ్స్)ను 4 వేల 5 వందల వరకు సమకూర్చుకుంటోంది. ఇవి ఇంటర్నెట్ ఆధారంగా పని చేయనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఐటిమ్స్ యంత్రాలు అవసరముంది. వీటిలో సగం మేర కేవలం గ్రేటర్‌లోనే వాడనున్నారు. తద్వారా క్యూఆర్ కోడ్ స్కానింగ్, కార్డు స్వైపింగ్‌తో ప్రయాణికులు టికెట్ కొనే సౌకర్యం ఆర్టీసీ కల్పించనుంది.
పెద్ద నోట్లతో రోజూ సవాళ్లే : హైదరాబాద్‌లో ఎక్కువ మంది ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడ్డారు. బస్సుల్లో టికెట్ కొనుగోలుకు రూ.100, రూ.200 నోట్లు ఇస్తుండటంతో కండక్టర్ల వద్ద వాటికి సరిపడా చిల్లర లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూ.10 నాణేలను తీసుకోవడంలోనూ కండక్టర్లు, ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
Conflicts on 10 Rupee Coins : రూ.10 నాణేన్ని తీసుకోవాలని స్వయంగా ఆర్బీఐ కోరినా, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించినా, కొన్ని బస్సుల్లో తీసుకోవడం లేదంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లవెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంకేతికతను బస్సుల్లో అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు ప్రారంభమైతే చిల్లర కష్టాలు తీరనున్నాయి.
ఫోన్లో చూపించినా చాలు : గ్రేటర్ పరిధిలో 5 లక్షల మందికి పైగా విద్యార్థులు వివిధ కళాశాలల్లో చదువుతున్నారు. వీరంతా బస్‌పాస్ రెన్యూవల్ కోసం ప్రతి నెలా సంబంధిత సెంటర్ల వద్ద వరుసలో ఉండాల్సిన సమస్యా త్వరలోనే తీరనుంది. ఇందుకు ఆర్టీసీ ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా బస్‌పాస్‌లు పొందే వెసులుబాటు కలగనుంది. తద్వారా పాస్‌ను సులభంగా కండక్టర్‌కు మొబైల్‌లోనే చూపించి ప్రయాణించొచ్చు.
'ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి సంతోషం లేకుండా చేయటమేనా ప్రజా పాలన అంటే'
హోంగార్డును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - అక్కడికక్కడే మృతి చెందిన సుబ్బరాజు