Digital Cyber Frauds In Telangana : సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసంతో ప్రజల సొమ్ము కొల్లగొడుతూనే ఉన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగాలు, డిజిటల్ లావాదేవీలను ఆసరాగా తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు తమ వాక్చాతుర్యంతో ప్రజలను బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా, ఇలాంటి మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలో మీ సేవ కేంద్రం నిర్వహిస్తున్న వ్యక్తి దగ్గర నుంచి రూ.50,000 కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు.
Cyber Frauds In Telangana : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా మీసేవ కేంద్రం నడుపుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఓ అపరిచితుడి నుంచి కేంద్రం నిర్వాహకుడికి ఫోన్ వచ్చింది. తాను ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నానని, అర్జెంటుగా రూ.50 వేలు కావాలని తెలిపాడు. నగదు పంపిస్తున్నానని, తాను చెప్పిన ఖాతాలో డబ్బు జమ చేయాలని కోరాడు. అందుకు ఆ నిర్వాహకుడు సరేనన్నారు.
మాటలతో మసిపూస్తూ మోసం : ఈలోపు అదే అపరిచితుడు ఓ రెస్టారెంట్ నిర్వాహకుడికి కాల్‌చేసి పెద్ద మొత్తంలో బిర్యానీలు కావాలని చెప్పాడు. అడ్వాన్స్ కోసం తాను చెప్పిన ప్రదేశానికి వెళ్లాలని చెప్పాడు. మీసేవ కేంద్రం చిరునామా ఇచ్చాడు. దీంతో రెస్టారెంట్‌లో పని చేసే వ్యక్తి అక్కడికి వెళ్లాడు. మీసేవ కేంద్రంలో అప్పటికే నలుగురైదుగురు వరుసలో ఉండటంతో, అతడు సదరు అపరిచితుడికి కాల్ చేసి తాను మీ సేవ కేంద్రానికి వచ్చానని తెలియజేశాడు. దీంతో అపరిచితుడు కేంద్రం నిర్వాహకుడికి కాల్ చేసి, తాను పంపిన మనిషి నగదు తీసుకొని వచ్చాడని, అర్జెంటుగా తాను చెప్పిన ఖాతాకు డబ్బులు బదిలీ చేయాలని కోరాడు.
ఎలాగూ వ్యక్తి ఎదురుగానే ఉన్నాడని కేంద్రం నిర్వాహకుడు నమ్మకంగా అతడు చెప్పిన ఖాతాకు రూ.50 వేలు పంపించాడు. ఆ తర్వాత క్యూ లైనులో వేచి ఉన్న వ్యక్తిని డబ్బులివ్వమని అడగ్గానే అతడు విస్తుపోయాడు. బిర్యానీల కోసం డబ్బు అడ్వాన్స్ తీసుకునేందుకు వచ్చానని, డబ్బుల సంగతి తనకు ఏమీ తెలియదని తెలిపాడు. దీంతో కేంద్రం నిర్వాహకుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తనకు కాల్ వచ్చిన నంబరుకు కాల్ చేస్తే అది స్విచ్చాఫ్ రావడంతో షాక్ అయ్యాడు.
వామ్మో ఇలా కూడా చేస్తారా : వెంటనే తేరుకొని, తాను డబ్బులు పంపించిన నంబరుకు కాల్ చేసి మాట్లాడారు. అది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా తేలడంతో, అతడితో మాట్లాడాడు. టకొంత సేపటి క్రితం గుర్తు తెలియని వ్యక్తి వచ్చి, ఖాతాలో డబ్బులు వస్తాయని చెప్పి చాలా సమయం ఎదురు చూశాడని, తన ఖాతాలో వచ్చిన నగదును చూసుకొని అతడికి డబ్బులు ఇచ్చి పంపించినట్లు అతడు తెలిపాడు. దీంతో వారంతా బిత్తరపోయారు. ఎంతో పకడ్బందీగా, పద్దతిగా జరిగిన ఈ మోసం మొత్తం వారి ముందు కదలాడింది. ఫోన్ చేసిందెవరో తెలియదు, వచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు. కానీ కాల్ చేసి చిన్న సంభాషణతో నమ్మకంగా డబ్బులు ఇచ్చేసి గుడ్డిగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అపరిచితుల నుంచి ఫోన్లు వస్తే స్పందించకూడదని తెలిపారు.
ఆన్లైన్లో లోన్ తీయించి మరీ రూ. 30 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
డిజిటల్ మోసాలకు ఆ మూడు దేశాలే ప్రధాన కేంద్రాలు- రూ.120కోట్లు నష్టపోయిన భారతీయులు