Dharani Portal News latest Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్(Dharani Portal Scheme) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాలపై ఇప్పటికే కమిటీ వేసిన విషయం తెలిసిందే. తాజాగా ధరణి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ పోర్టల్ సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించింది.
Dharani Portal Powers Transfer : ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న ధరణి పోర్టల్ అధికారాలు ఇప్పుడు తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో ఈ మార్గదర్శకాల్లో రాష్ట్ర సర్కార్ వెల్లడించింది.
17 రకాల మాడ్యుల్స్కు సంబంధించి సవరింపుల కోసం వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 2.45 లక్షలకు చేరుకుంది. ధరణి పోర్టల్‌లో సవరింపుల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు సంఖ్య 2,45,037గా ఉంది. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో(Land Pass Book) డేటా కరెక్షన్ కోసం లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. రికార్డుల అప్డేషన్ పేరుతో నిషేధిత జాబితా పార్ట్-బిలో 13.38 లక్షల ఎకరాలు ఉన్నాయి. అలాగే ఎలాంటి కారణాలు లేకుండా నిషేధిత జాబితాలో 5.07 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ధరణి సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ : రాష్ట్రంలో ధరణి దరఖాస్తుల(Dharani Application) పరిష్కారం కోసం మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు సదస్సులు జరగనున్నాయి. రెవెన్యూ శాఖ, ధరణి పోర్టల్‌కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా వాటిని పరిష్కరించే వరకు ఎంఆర్ఓ స్థాయిలో సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం చేసిన తప్పులు ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దుతున్నందున ధరణి దరఖాస్తుల పరిశీలన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
Dharani Portal Scheme : గత ప్రభుత్వం కుట్రపూరితంగా దురుద్దేశంతో తీసుకొచ్చిన ధరణి వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన ఆక్షేపించారు. ధరణితో ప్రజల జీవితాలను ఆగం ఆగం చేయడమే కాకుండా రెవెన్యూ వ్యవస్థను కొల్లగొట్టారని ఆరోపించారు. ధరణి పుణ్యమానని ఎన్నో రైతు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది ఎకరాలు ధరణి పేరిట మాయం చేశారని, గత ప్రభుత్వ పెద్దలే ధరణి దందాలకు అండదండలుగా నిలిచారని విమర్శించారు. ధరణిపై నమోదు చేసిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించుటకు ప్రత్యేక రెవెన్యూ సదస్సులు(Dharani Special Drive) ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయనున్నామని స్పష్టం చేశారు. ధరణిపై కూడా ఓ శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.