Devi Navaratri Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఆదివారం కావడంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఊరూరా ఏర్పాటుచేసిన మండపాల్లో నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
దసరా శరన్నవరాత్రి వేడుకలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుష్మాండా దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభోగంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి అలంకరణలోని జగన్మాతను దర్శించుకుని భక్తులు పారవశ్యంలో మునిగితేలారు.
గౌరీదేవి అలంకరణలో అమ్మవారు : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలోశ్రీ లలితాదేవి అలంకారంలోని అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. రెండో బాసరగా ప్రసిద్ధి పొందిన సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గౌరీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
రూ.6.66 కోట్లతో అమ్మవారి ముస్తాబు : హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ శ్రీ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అక్షరాల 6 కోట్ల 66లక్షల 66వేల 666 రూపాయల 66 పైసలతో అమ్మవారిని అలంకరించారు. తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేక వ్యక్తులను రప్పించి 50 రూపాయల నుంచి మొదలుకొని 500 రూపాయల నూతన కరెన్సీ నోట్లతో వివిధ రూపాల్లో మలిచి గర్భాలయంతో పాటు దేవాలయంలో అలంకరించారు. కరీంనగర్‌లోని మెహర్ నగర్ లో దుర్గామాత మండపం వద్ద అమ్మవారికి ప్రత్యేక హోమం నిర్వహించారు.
దీర్ఘ సుమంగళితనం కోసం ఉపాంగ లలితా వ్రతం- ఎలా పూజ చేయాలో తెలుసా? - Dussehra 2024
'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' - అక్కడ మగవాళ్లూ ఆడతారు! - bathukamma Celebrations 2024