Design Land Program in Hyderabad : పుర్రెకో బుద్ది జిహ్వాకో రుచి అంటారు. ముగ్గురు యువకులు సంజయ్ రెడ్డి, రవితేజ, అభిషేక్‌లకు మాట సరిగ్గా సరిపోతుంది. ఉన్నత చదువులు పూర్తి చేసి పలు కార్పొరేట్ సంస్థల్లో డిజైనింగ్ విభాగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేయడంతోనే వీరి బాధ్యత మరిచిపోలేదు. అందుకు కారణమైన డిజైనింగ్ రంగంలో యువతకు ఎలాంటి భవిష్యత్ ఉందో చాటి చెప్పాలనుకున్నారు.
Design Land Company Program : ముగ్గుర యువకులు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి ఎలా ఎదగవచ్చో చూపించాలనుకున్నారు. అందుకు డిజైన్ ల్యాండ్ పేరుతో 45 రోజుల కిందట ఒక కమ్యూనిటీని ప్రారంభించారు. పుణె, ముంబయి, దిల్లీలో మీటప్స్, వర్క్ షాప్స్ నిర్వహించారు. 5 వేల మందికిపైగా డిజైనర్లను కమ్యునిటీలో భాగస్వాములను చేసుకున్నారు. ప్రపంచ దేశాల్లో డిజైనింగ్ రంగం పురోగతి, డిజైనర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా తొలిసారి డిజైన్ ల్యాండ్ పేరుతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు యువత నుంచి విశేష స్పందన లభించింది. డిజైనింగ్ రంగం పట్ల అభిరుచి కలిగిన యువత పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. మైక్రోసాప్ట్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలలో పని చేసే మెంటర్స్ ఈ సదస్సుకు హాజరై అనుభవాలు పంచుకున్నారు. రవితేజ తన ఐదేళ్ల అనుభవంతో రాసిన నోడ్స్ ఆఫ్ విజమ్స్, సంజయ్ రెడ్డి రచించిన ఇంటర్డక్షన్ ఆఫ్ డిజైన్ పుస్తకాలను ఆవిష్కరించారు.
People Success Story in Designing Sector : ఇతర దేశాల తరహాలోనే ఒక డిజైనింగ్ సమూహాన్ని ఎందుకు ప్రారంభించకూడదని ఆ ముగ్గురు యువకులు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా డిజైన్ ల్యాండ్ పేరుతో కమ్యునిటీ ప్రారంభించారు. తమలాంటి అభిరుచి కలిగిన యువతకు అవగాహన కల్పించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి మార్గాలను చూపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భారత్ మేక్‌ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. అందుకు తమవంతుగా కృషి చేయాలని ఈ రంగాన్ని ఎంచుకున్నారు. భవిష్యత్‌లో ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాలకే కాక డిజైనింగ్ రంగానికి ప్రాధాన్యత ఉంటుందని సంజయ్ రెడ్డి తెలిపారు. యూఎక్స్, యూఐ డిజైనర్లకు కంపెనీలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కోరినంత జీతాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాయని చెబుతున్నాడు.
"డిజైనింగ్ ల్యాండ్ కార్యక్రమం గురించి చెప్పాలంటే డిజైనింగ్ ఆవశ్యకత తెలియజేయడం. హైదరాబాద్ కమ్యూనిటీని పెంచేలా కృషి చేస్తాం. మేము మొదలు పెట్టి 45 రోజులు అయింది.ఐదువేలకు పైగా డిజైనర్స్ ఉన్నారు. పూణె, ముంబయి, దిల్లీలో మీటప్స్ చేశాం. హైదరాబాద్‌లో తొలి కార్యక్రమం చేశాం." - రవితేజ, డిజైన్ ల్యాండ్ సహా వ్యవస్థాపకుడు
Design Courses Training in Hyderabad : మైక్రోసాప్ట్‌లో యూఎక్స్ డిజైనర్‌గా రవితేజ 8 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. తనకున్న అభిరుచితో ప్రత్యేకంగా 100 మంది నిపుణులతో పాడ్ కాస్ట్‌లో ఇంటర్వ్యూలు చేశాడు. వారి అనుభవాలను పుస్తకంగా మలిచి డిజైనర్ కావాలనుకునే ఔత్సాహికులకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నా వాటి గురించి యువతకు అవగాహన లేకపోవడంతో అటువైపు అడుగులేయడం లేదని తెలుసుకున్నారు. ఆ లోటు భర్తీ కోసమే హైదరాబాద్ వేదికగా తొలి సదస్సు నిర్వహించారు. ఇకపై కళాశాల స్థాయిలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు చూపించేలా దేశవ్యాప్తంగా మరిన్ని సదస్సుల నిర్వహణకు సిద్ధమంటున్నారు.