Telangana Socio Economic Report 2024 : రాష్ట్ర ప్రణాళిక శాఖ తయారుచేసిన 2024 సామాజిక ఆర్థిక ముఖచిత్రం నివేదికను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం విడుదల చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల సమాచారం గణాంకాలను ఇందులో పొందుపరిచారు. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,24,104 ఉండగా, 2023-24 నాటికి అది రూ.3,47,299లకు పెరిగింది.
తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.9,46,862లతో అగ్రభాగాన ఉండగా, 4,94,033 రూపాయలతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నాయి. 19 జిల్లాల తలసరి ఆదాయం రెండు నుంచి మూడు లక్షల మధ్య ఉండగా, 11 జిల్లాలు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల మధ్య ఉన్నాయి. రూ.1,80,241 తలసరి ఆదాయంతో వికారాబాద్ జిల్లా అట్టడుగున ఉంది.
Socio Economic Profile Report 2024 : ఇదే సమయంలో రాష్ట్ర మొత్తం అప్పు రూ.72,658 కోట్ల నుంచి ఏకంగా 824.5 శాతం పెరిగి రూ.6,71,757 కోట్లకు చేరింది. ఫలితంగా రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు 8.7 శాతానికి పైగా పెరిగింది. 2014-15లో ఒక్కొక్కరిపై అప్పు రూ.20,251 కాగా, 2023-24 నాటికి అది రూ.1,76,360లకు చేరింది.
2023-24 లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 11.9 శాతం వృద్ధితో రూ.14.64 లక్షల కోట్లకు చేరింది. జిల్లా స్థూల ఉత్పత్తి పరంగా రంగారెడ్డి జిల్లా రూ.2,83,419 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, ములుగు జిల్లా అత్యల్పంగా రూ.6,914 కోట్లు ఉంది. తెలంగాణలో నిరుద్యోగం రేటు జాతీయ సగటు కంటే 1.3శాతం ఎక్కువగా ఉంది. మాతా, శిశు సంరక్షణ విషయంలో రాష్ట్ర పరిస్థితి మెరుగుపడింది.
మాతా, శిశు సంరక్షణలో రాష్ట్రం జాతీయ సగటు కంటే మెరుగు : తల్లులు, చిన్నారుల మరణాల రేటు రెండింటిలోనూ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో పింఛన్లు, ఆర్థికసాయం పొందుతున్న వారి సంఖ్య 43 లక్షలకు పైగా ఉంది. 2014 తర్వాత సాగునీటి రంగంపై రూ.1,81,67 కోట్లు ఖర్చు చేసి 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాధించారు. రహదారుల పొడవు హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 1,332 కిలోమీటర్లు ఉన్నాయి.
ములుగులో అతి తక్కువగా 41 కిలోమీటర్ల మేర ఉన్నాయి. సేవల రంగంలో జాతీయ వృద్ధి రేటు 9.5 శాతం కాగా, తెలంగాణ వృద్ధి రేటు 14.6 శాతంగా నమోదైంది. 2022-23 లో ఐటీ ఎగుమతుల విలువ రూ.2,42,275 కోట్లు. జాతీయ వృద్ధి రేటు 9.36 శాతం కంటే తెలంగాణ వృద్ధి రేటు 31.44 శాతం ఎక్కువ. జూన్ 29 వరకు ప్రజావాణికి ఐదు లక్షలకు పైగా ఫిర్యాదులు వస్తే అందులో నాలుగు లక్షలుగా పైగా పరిష్కరించారు.
హైదరాబాద్‌పై స్పెషల్ నజర్ - ఏకంగా రూ.10వేల కోట్ల కేటాయింపులు - HYDERABAD DEVELOPMENT BUDGET 2024