Bhatti Vikramarka On Women Group Loan : రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఈ ఏడాదే రూ.20 వేల కోట్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా ఖమ్మం కలెక్టరేట్‌లో స్వయం సహాయక సంఘాల ద్వారా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టరేట్ బస్టాప్ వద్ద స్త్రీ టీస్టాల్‌ను ప్రారంభించారు. మహిళా ఉద్యోగుల కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కేటాయించిన ఫీడింగ్ రూమ్, డైనింగ్ హాలును ప్రారంభించారు.
అనంతరం మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ చిన్నతరహా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి వారికి కేటాయించనున్నట్లు వెల్లడించారు. వడ్డీ లేని రుణాలు తీసుకుని పరిశ్రమలు స్థాపించాలని, ఆర్థిక స్వావలంబనతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సలు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.400 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు.
Empowering women is empowering society!
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) October 27, 2024
Telangana is setting a remarkable example for the country by prioritizing women’s development.
Today, Inaugurated the Indira Mahila Shakti Canteen, a bus shelter with a feeding room, and a canteen for employees in Khammam District.
Our… pic.twitter.com/yxWzwJwI0A
తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శం కావాలి : ఎవరైనా మహిళా సంఘాలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హెచ్చరించారు. తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా ఉండాలంటూ ఆకాంక్షించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలోనూ భవిష్యత్తులో వారికి భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో స్ట్రీ టీసాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ సత్యనారాయణ, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేసే 'ఇందిరా శక్తి పథకం' - ఎప్పటినుంచంటే?
మహిళా శక్తి ఓ బ్రాండ్ కావాలి : మంత్రి సీతక్క - Mahila Shakti programme