Minister Bhatti on SHG Loans : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మహిళలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు సంవత్సరానికి రూ. 20,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తామని ఆయన వెల్లడించారు. అప్పులు చేసి సంపద సృష్టించి, దాని ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
గాంధీభవన్‌లో ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీకి పూర్తిగా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరంలేదని స్పష్టం చేశారు. రైతుభరోసాపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతామని ఆయన తెలిపారు.
కులగణన చేపట్టాలి.. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కుల గణన చేపట్టాలని, భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తద్వారా దేశ సంపద వనరులు అందరికి పంచబడాలని, పాలనలోనూ భాగస్వాములను చేయాలనేదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణ జరగాలని నిండు సభలో వాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కోరారని, న్యాయ విచారణ అంటే వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఈ దేశ సంపద వనరులు దామాషా ప్రకారం పంచబడాలని రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేశారని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేశారు. జనాభా దామాషా ప్రకారం సంపద పదవులు పంచాలని రాహుల్ గాంధీ ఎన్నికల ముందు కోరారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ ఆలోచనలు అమలు చేస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు. వారి ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. దేశంలో కులగణన జరగాలని రాజీవ్ గాంధీ ఇచ్చిన పిలుపు విప్లవాత్మకమైనదిగా పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు సంవత్సరానికి రూ. 20,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రైతు రుణమాఫీకి కట్టుబడి ఉంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసాపై చర్చించి, నిర్ణయం తీసుకుంటాము. - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
బర్త్ డే స్పెషల్ - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం భట్టి - Deputy CM Bhatti birthday