Deputy CM Bhatti Vikramarka Meet Odisha CM Mohan Charan Majhi : ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభంపై తెలంగాణ - ఒడిశా మధ్య అంగీకారం కుదిరింది. ఇవాళ ఒడిశా పర్యటనకు వెళ్లిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీతో సమావేశమయ్యారు. నైనీ బొగ్గు బ్లాక్‌లో తవ్వకాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని మోహన్ చరణ్ మాఝీ హామీ ఇచ్చారు. వెంటనే ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
నైనీ బ్లాక్‌లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారుల బృందంతో కలిసి ఒడిశా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. స్థానిక ఎమ్మెల్యే, నిర్వాసితులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క సింగరేణికి బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను వివరించారు. 2017లోనే సింగరేణికి నైని గనులను కేటాయించారని గుర్తు చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. ఆనాడు ఇచ్చిన వినతి పత్రాలను అందజేశారు. తాడిచర్ల బ్లాక్, నైనీ బ్లాక్‌లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా గతంలోనే విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.
ఒడిశాకు రూ.600 కోట్ల ఆదాయం : నైనీ బ్లాక్‌లో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశా సీఎంకు వివరించారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్‌లో ఉందని, ఈ సమస్య పరిష్కారం అయితే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని చెప్పారు. ఈ బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం మూలంగా ఒడిశా రాష్ట్ర యువకులకు పెద్ద సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు.
దేశంలో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వ సంస్థ సింగరేణి మనుగడకు నైనీ బొగ్గు గనులు అత్యంత ఆవశ్యకమని భట్టి వివరించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను ఒడిశా సీఎంకు అందజేశారు. ఈ విజ్ఞప్తిపై ఒడిశా సీఎం వెంటనే స్పందించారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని డిప్యూటీ సీఎం బృందానికి స్పష్టం చేశారు. భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని స్థానికంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణి సంస్థ ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తిని వీలైనంత త్వరలోనే ప్రారంభించే అవకాశాలు నెలకొన్నాయి.
భువనేశ్వర్ నుంచి 140 కిమీ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 140 కిలోమీటర్ల దూరంలోని నైనీ బొగ్గు గనుల ప్రదేశం ఉంది. ఈ మార్గానికి భట్టి విక్రమార్క రోడ్డు మార్గంలో తన బృందంతో కలిసి పర్యటించారు. దాదాపు 950 హెక్టార్లలో నైనీ బొగ్గు బ్లాకు ప్రదేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతానికి ఉన్న రోడ్డు రవాణా సౌకర్యాలు తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు.