Deputy CM Bhatti Vikramarka On Indiramma Housing Scheme : ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తున్నామని పునరుద్ఘాటించారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. పిప్పిరిలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన తన పాదయాత్ర ప్రధాన కారణమని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా అంటే వెనకబడిన ప్రాంతం కాదని, రాష్ట్రంలోని మిగతా జిల్లాలకంటే అగ్రభాగాన నిలిపే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష అదనం : వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని మళ్లీ తుమ్మిడిహెట్టి వద్దనే పునఃప్రారంభిస్తామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోటీపరీక్షలకు ఉపయోగపడేలా ప్రతి నియోజకవర్గంలో డా. బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జి సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ పక్కా ఇళ్లు పేరిట నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలైతే, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ. లక్ష కలిపి రూ.6 లక్షల వరకు చెల్లించనున్నట్లు తెలిపారు.
ఆయనకంటే ముందు ప్రసంగించిన బీఆర్ఎస్కు చెందిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కపై ప్రశంసల వర్షం కురిపించటం రాజకీయప్రాధాన్యతను సంతరించుకుంది. పేరులోనే విక్రమార్క కలిగి ఉన్నదనీ, అడగకుండానే ఉపముఖ్యమంత్రిగా ఎన్నో వరలాలు ఇచ్చారని అభినందిస్తూనే, కుప్టి ప్రాజెక్టు సహా తేజాపూర్, బాబాపూర్, బుగ్గారం ఎత్తిపోతల పథకాల అంశాన్ని ప్రస్థావించగా మంజూరు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
పోడుభూములను లబ్ధిదారులతో దున్నిస్తాం : చనాఖా-కోరాట, సదర్మాట్, పెద్దవాగు, పీపీరావు ప్రాజెక్టులను మంజూరు చేయటం సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అర్హులైన గిరిజన, గిరిజనేతరుల సాగుచేసుకుంటున్న పోడుభూములకు పట్టాలిప్పించి దగ్గరుండి దున్సిస్తానని భట్టివిక్రమార్క భరోసా ఇచ్చారు.
"ఇది ప్రజా ప్రభుత్వం. వచ్చే ప్రతి రూపాయి కూడా దుబారా ఖర్చు కాకూడదని, ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఆనాడు మాట ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్లాను. చిక్మాన్ ప్రాజెక్ట్ మీ చిరకాల వాంఛ ప్రాజెక్ట్ దీన్ని పూర్తిచేయాలని అడిగారు. నాటి పాదయాత్ర సందర్భంగా మీరు చెప్పిన ప్రతిమాట నాకు ఇప్పటికీ గుర్తే. దాన్ని పూర్తి చేయటమే కాకుండా, తప్పనిసరిగా మీ భూములు మీకే ఇచ్చి, పట్టాలిస్తాం. ఆ పట్టాల ద్వారా ఆ భూమిలోకి మిమ్మల్ని తీసుకువెళ్లి భూములు దున్నిస్తాం. ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం."-భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి