Kavitha Bail Petition Updates : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈనెల 6న తీర్పు ఇస్తామని కోర్టు ప్రకటించింది. 6వ తేదీనే ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై తుది ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై తుది ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తి కావేరి బవేజా వెల్లడించారు.
Delhi Liquor Scam Updates : దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న ఆమె, తనకు సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలే ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ సుదీర్ఘ వాదనలు వినిపించారు.
మనీలాండరింగ్ కేసులో అనేక మంది నిందితులకు బెయిల్ రాలేదని ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు కవిత తన ఫోన్లలో సమాచారం డిలీట్ చేశారని అన్నారు. ఆమె ఇచ్చిన 10 ఫోన్లనూ ఫార్మాట్ చేసి ఇచ్చారని, సమాచారం తొలగించడంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని కోర్టుకు వివరించారు. కవిత సాక్ష్యాలు ధ్వంసం చేశారని, సాక్షులను బెదిరించారని ఆరోపిస్తూ జోయబ్ హుస్సేన్ వాదనలను ముగించారు. ఈ క్రమంలోనే ఈడీ వాదనలపై రిజాయిన్డర్ లిఖితపూర్వకంగా ఇస్తామని కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్‌పై మే 6న తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.
మరోవైపు దిల్లీ మద్యం విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు కవిత అర్హురాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలరని అన్నారు. లిక్కర్ కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారని చెప్పారు. అందుకే కవిత బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఇరువైపు వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు దీనిపై మే 2న తుది ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్‌పై ఈనెల 6వ తేదీన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.