Cyber Kidnapping Crimes in Hyderabad : ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను రోజుకో రకంగా మోసం చేస్తున్నారు. నేరాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించడంతో కొత్త పంథాలతో సైబర్ నేరాలకు తెరలేపుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని అల్వాల్‌లో మీ కొడుకును కిడ్నాప్ చేశామంటూ డబ్బులు డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు.
కిడ్నాప్ పేరుతో మోసం : అల్వాల్‌కు చెందిన ఓ యువకుడు తిరుపతి వెళ్లాడు. ఫోన్ గదిలో పెట్టి దర్శనానికి వెళ్లాడు. ఇదే సమయంలో యువకుడి తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీ అబ్బాయిని కిడ్నాప్ చేశామని డబ్బులివ్వాలని బెదిరించారు. కొడుకుకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో భయంతో మొదట రూ.50 వేలు పంపారు. ఇంకా అడగడంతో పోలీసులను ఆశ్రయించారు.
దేశం కాని దేశంలో పిల్లలను చదివిపిస్తూ వారు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారోనని తల్లిదండ్రులు పదేపదే ఆలోచిస్తుంటారు. పిల్లలు వివిధ పనులపై రాష్ట్రాలు దాటి వెళ్తుంటారు. ఇలాంటి వారే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు అనువుగా మారారు. వీలైతే వాళ్ల కుమారుడి ఫోన్ నుంచి లేదంటే సొంతంగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కిడ్నాప్అయ్యాడనో, డ్రగ్స్‌లో దొరకాడనో ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు.
విదేశీ నెంబర్ల తరహాలో కనిపించేలా వీవోఐపీ (వాయిస్ ఓవర్ ఇంటర్‌నెట్ ప్రోటోకాల్) కాల్స్ చేస్తున్నారు. తర్వాత అందినకాడికి దోచుకొని ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ పార్శిల్ మోసాల తరహాలోనే ‘సైబర్ కిడ్నాపింగ్’ పేరుతో నేరగాళ్లు సరికొత్త మోసం మొదలుపెట్టారు. ట్రావెల్ ఏజెన్సీల్లో నమోదైన డేటా ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఈ మోసాలకు దిగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు ఇలా : పిల్లల్ని కిడ్నాప్ చేశామని కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డయల్ 100, స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి. ముందుగా పిల్లలకు ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కోవాలి. ఫోన్‌లో స్పందించకపోతే వారు చదివే విద్యాసంస్థలు, మిత్రులకు కాల్ చేయాలి. సమయం తేడా వల్ల విదేశాల్లో ఉండే వారు స్పందించకపోతే స్థానిక పోలీస్‌స్టేషన్లలో సంప్రదించాలి.
'పోలీసులు మీకు ఫోన్ చేయరు - కాల్ చేస్తోంది మేం కాదు కేటుగాళ్లు' - సైబర్ నేరాలపై డీజీపీ