Online Frud in Medak : సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు తమ పంథా మారుస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న కొద్ది, నేరగాళ్లు కొత్తదారులను వెతుకుతున్నారు. అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఓ కిరాణా దుకాణం యజమాని భారత్ పే పేరుతో లక్ష రూపాయలకు పైగా పోగుట్టుకున్నాడు.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఇమ్మడి విశ్వనాధ్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయత్రం విశ్వనాథ్ కిరాణంలో ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తాను భారత్ పే కంపెనీ నుంచి వచ్చానని చెప్పాడు. విశ్వనాథ్‌కు భారత్ పే నుంచి రూ.1400 రీఫండ్ వచ్చేది ఉండగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ అనుకొని అతనిని నమ్మాడు. తన వద్ద ఉన్న మొబైల్ ఇచ్చాడు.
అతను కాసేపు మొబైల్లో మెసేజ్ పెట్టినట్టు చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత విశ్వనాథం ఖాతాలోంచి 1,28,000 మరొక ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసినట్టు మెసేజ్ వచ్చింది. దీన్ని గమనించిన ఆ కిరాణ యజమాని మోసపోయానని గమనించి వెంటనే నరసాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ నిందితుడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాళ్లకి సెల్ ఫోన్లు ఇవ్వకూడదని పోలీసులు సూచించారు.
సైబర్ మోసాలను అరికట్టేందుకు జాగ్రత్తలు : సైబర్ మోసాలను అరికట్టేందుకు డిజిటల్ చెల్లింపు సేవలను అందించే సంస్థలతో పాటు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ సహాయంతో రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో చాలా మంది ఆటోపే ఆప్షన్ వినియోగించడంతో ఈ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ మంది తమ ఫోన్ నంబర్లను యూపీఐ ఐడీలుగా ఉంచుకుంటున్నారు. అయితే ఇలాంటి వారందరిని చాలా సులభంగా మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారని తద్వారా మన ఫోన్ నంబరున్న యూపీఐ ఐడీకి వివిధ రకాల మెసేజ్‌లు పంపిస్తుంటారని చెబుతున్నారు. ఇందులో తెలియకుండా ఏ లింక్ క్లిక్ చేసినా అంతే సంగతులు.