TG Citizens Lose Rs 5cr to 6 cr To Cyber Frauds Daily : ప్రజల ఆశ, ఏమరపాటును ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు వారి ఖాతాల్లోని కోట్ల రూపాయల నగదును కాజేస్తున్నారు. దేశంలోని నేరగాళ్లే ఇదంతా చేస్తున్నా చివరకు నగదు చైనీయులకు బిట్ కాయిన్ల రూపంలో చేరుతోంది. పోలీసుల గణాంకాల ప్రకారం టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెల్ప్‌లైన్ నంబర్ 1930కు 500 వరకు ఫిర్యాదులు వచ్చాయి.
సైబర్ క్రైమ్స్‌లో ఆ తరహా నేరాలే ఎక్కువ : సైబర్ నేరాల్లో అధికశాతం ఇన్వెస్ట్‌మెంట్, జాబ్, కొరియర్ ఫ్రాడ్‌లే ఉన్నాయి. ఇదంతా చైనాకు చెందిన నకిలీ కంపెనీల మాయాజాలం. తామెవరో బయటి ప్రపంచానికి తెలియకుండా వేల కోట్ల రూపాయల భారతీయుల కష్టాన్ని క్షణాల్లో కాజేస్తున్నారు. ఈ తప్పిదంలో మన దేశ పౌరులను ఏజెంట్లుగా మలచుకుంటున్నారు. వీరి పేరుతోనే బ్యాంకు ఖాతాలు, నకిలీ సంస్థలు, క్రిప్టో, బిట్‌కాయిన్ ఖాతాలు తెరిపించి పావులుగా తయారు చేసుకుంటున్నారు.
Cyber Crimes In The Name Of Investment, Courier : గతంలో రుణయాప్‌లు ఎటువంటి పత్రాల్లేకుండా అడగ్గానే అప్పులిచ్చేవి. నకిలీల ముసుగులో దేశంలో సంస్థలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతనే డైరెక్టర్లుగా నియమించుకునేవారు. వీరి ద్వారానే పేద, మధ్యతరగతి యువత, నిరుద్యోగులు, గృహిణులకు అప్పులు ఇప్పించారు. పాత రుణం తీర్చేందుకు కొత్త అప్పులు చేయించి ఊబిలోకి నెట్టేశారు. 400శాతం వడ్డీలు వసూలు చేసి ఎంతోమంది ఆత్మహత్యకు కారకులయ్యారు. పోలీసుల చర్యలతో ఈ నేరాలు ఇప్పుడు తగ్గినా ప్రస్తుతం పెట్టుబడులు, కొరియర్ పేరుతో నేరాలు జరుగుతున్నాయి.
డిజిటల్ అరెస్ట్ పేరుతో దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు : ప్రధానంగా కొరియర్ ఫ్రాడ్‌లో బాధితులను బెదిరించి డిజిటల్ అరెస్ట్‌లు చేసి డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులను అక్కడి విమానాశ్రయాల్లో చైనా గైడ్స్ ట్రాప్ చేస్తున్నారు. తమ సంస్థ భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు చేపట్టబోతుందని, దానికి అవసరమైన మానవ వనరులను ఎంపిక చేసుకుంటున్నామంటూ నమ్మిస్తున్నారు.
ఆసక్తిగల వారిని సొంత ఖర్చులతో దుబాయ్, హాంకాంగ్, షాంగై, మలేషియా తదితర దేశాలకు తీసుకెళ్తున్నారు. ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేసి ఒకట్రెండు రోజులు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి బ్యాంకు ఖాతాలు సమకూర్చటం, క్రిప్టో, బిట్‌కాయిన్ల ఖాతాలు రూపొందించటం, నకిలీ సంస్థల ఏర్పాటు తదితర బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా 50వేల నుంచి లక్ష వరకు కమీషన్ ఇస్తున్నారు.
దళారుల సహాయంతో : చైనా సంస్థలు దళారులకు ఒక్క బ్యాంకు ఖాతా సమకూర్చేందుకు 50వేలు ఇస్తాయి. వాటిలో రూ.20వేలతో ఖాతా తెరిపించి వారు రూ.30వేలు కాజేస్తున్నారు. ఇలా గోవా, ముంబయికి చెందిన ఇద్దరు దళారులు ఇటీవల 500 బ్యాంకు ఖాతాలు తెరిపించి చైనా కేటుగాళ్ల చేతికి అప్పగించారు. ఈ ఖాతాల ద్వారా బాధితుల నుంచి మాయగాళ్ల ఖాతాల్లోకి చేరిన నగదును వెంటనే వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తారు.
కొన్నిసార్లు వాలెట్, డిజిటల్ ఖాతాల్లో జమచేస్తారు. అక్కడి నుంచి హవాలా ముఠాల చేతుల్లోకి డబ్బు చేరుతుంది. అక్కడి నుంచి బిట్‌కాయిన్ ఖాతా ఉన్న వారి ఖాతాల్లో నగదు జమవుతుంది. లక్షకు 6 నుంచి 8 వేల కమీషన్ చొప్పున క్రిప్టో కరెన్సీగా మార్చుతారు. దాన్ని హాంకాంగ్, దుబాయ్, మలేషియాల నుంచి చైనాకు చేరవేస్తున్నారు. క్రిప్టోగా మారిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకోవటం, ఖాతాలను స్తంభింపజేయటం అసాధ్యమమని సైబర్‌క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
సైబర్ నేరగాళ్లు కాజేస్తున్న డబ్బు ఎక్కడికి చేరుతుంది? : ఇప్పటివరకు సైబర్ క్రైమ్‌ల దర్యాప్తులో పోలీసులు నేరగాళ్లు కాజేసిన నగదు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకు ఖాతాకు మళ్లిస్తున్న విషయంలో 3-4 లేయర్ల వద్దకు మాత్రమే వెళ్లగలుగుతున్నారు. మాయగాళ్లు కాజేసిన సొమ్ము చివరికి ఎక్కడకు చేరిందనేది ప్రశ్నగానే మిగిలిపోతోంది. హవాలా మార్గంలో చైనా, దుబాయ్ చేరినట్టు అంచనా వేయటం మినహా ఇప్పటివరకూ పక్కా ఆధారాలు సేకరించలేకపోతున్నారు.
ఈ సమస్యను అధిగమించాలనే సంకల్పంతో నగర సైబర్‌క్రైమ్ పోలీసులకు దర్యాప్తులో మరింత శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందించాలని భావిస్తున్నారు. కీలకమైన కేసుల్లో ఈడీ కూడా దర్యాప్తులో భాగం పంచుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
కొరియర్ అంటూ లాక్ చేస్తారు - కోట్ల రూపాయల సొమ్ము కాజేస్తారు - Courier Frauds in Telanganaమహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియో కాల్ - ఆపై రూ.60 లక్షల లూటీ - Cyber Crime in Hyderabad