Cyber fraud With Facebook : సోషల్ మీడియాలో తెలిసిన వారి ఖాతాల నుంచి మెసేజ్ రాగానే నిజమే అనుకుని చాట్ చేస్తుంటాం. దీనినే ఆసరా చేసుకుని సైబర్ నేరాలు చేస్తున్నారని, ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోజుకో కొత్త పంథాతో నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు ఇటీవల తెలిసిన వారు, ప్రముఖుల పేర్లు, ఫొటోలు పెట్టి సామాన్యులకు సందేశాలు పంపి డబ్బు కాజేస్తున్నారు. తాజాగా అచ్చం ఇలాంటి ఘటనే నిజామాబాద్‌లో చోటు చేసుకుంది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో ఒకటైన ఫేస్‌బుక్‌లో మెసేజ్ పంపి ఓ వ్యక్తి దగ్గర సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.లక్ష కొట్టేశారు. నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హౌస్ ఆఫీసర్) మహ్మద్ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా కేంద్రం చంద్రశేఖర్ కాలనీలో అన్సారీ అక్తర్ హైమద్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. గత నెల నవంబర్ 12న దుబాయిలో ఉంటున్న తన అన్న కుమారుడు అసద్ అన్సారీ ఫొటో, పేరుతో ఫేస్‌బుక్‌లో మెసేజ్ వచ్చింది. తన పాస్‌పోర్టును ఏజెంట్ తీసుకున్నాడని, రూ.లక్ష కట్టాలని డిమాండ్ చేస్తున్నాడని చెప్పాడు. తాను చెప్పిన నంబర్‌కు ఎలాగైనా డబ్బులు పంపి ఏజెంట్‌తో మాట్లాడి తనను కాపాడాలని ఆ సందేశంలో ఉంది.
నిజం తెలుసుకుని షాక్ : దీంతో తన అన్న కుమారుడే కదా అని అన్సారీ అక్తర్ హైమద్ ఆ నంబర్‌కు విడతల వారీగా రూ.లక్ష పంపారు. తర్వాత అసద్ అన్సారీకి ఫోన్ చేసి, డబ్బులు పంపానని, భయపడొద్దని చెప్పడంతో తాను ఎలాంటి మెసేజ్ పంపలేదని చెప్పడంతో అక్తర్ హైమద్ షాక్ తిన్నాడు. బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో ఆరీఫ్ తెలిపారు.
టెకీని కాపాడిన పోలీసులు : సైబర్ నేరగాళ్ల వలలో నుంచి ఇటీవల ఓ టెకీని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కాపాడారు. కేవలం 11 నిమిషాల వ్యవధిలో రూ.18 లక్షల నగదును తిరిగి పొందగలిగాడు. లేదంటే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయేవాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోనే జరిగింది. ఇక నుంచి ఇలాంటి కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సైబర్ క్రైం పోలీసులు ఈ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
'ప్రముఖుల పేర్లతో ఫేక్ అకౌంట్స్ - ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి'