Cyber Crime in Hyderabad : మసిపూసి మారేడు కాయ చేయడమంటే ఇదేనేమో. ముందుగా బడా వ్యాపారవేత్తను టార్గెట్గా పెట్టుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమంటూ ఫోన్ చేశారు. మీ పేరిట ఇంటర్నేషనల్ కొరియర్ ఏజెన్సీ ద్వారా పార్శిల్ వచ్చిందని నమ్మించారు. అందులో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరించారు. దీనిపై కేసు నమోదు చేస్తామని, అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేసి నగదు(Cyber Crime) దోచేసుకున్నారు. హైదరాబాద్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసుల చాకచక్యంతో పెద్ద మొత్తంలో సొమ్మును రికవరీ చేయగలిగారు.
గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారికి వారం రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమంటూ సదరు వ్యాపారితో మాట్లాడారు. ప్రముఖ ఇంటర్నేషనల్ కొరియర్ సంస్థ ద్వారా మీ పేరుపై ఒక పార్శిల్ వచ్చిందని, అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని నమ్మించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు.
Cyber Crimes in Telangana : ఇదంతా నిజమనుకుని భయపడిపోయిన ఆ వ్యాపారి తనను రక్షించమని అవతలి వ్యక్తిని వేడుకున్నారు. దీంతో వారు చెప్పిన ఖాతాలో రూ.కోటి జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని వారు నమ్మించారు. అసలే భయంతో ఉన్న ఆయన, వెంటనే రూ.98 లక్షలు జమ చేశాడు. ఆ తరువాత అనుమానం వచ్చి వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలంగాణ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరోకు వివరాలు చేరాయి.
అయోధ్య రాముడి పేరుతో సైబర్ క్రైమ్స్ - ఆ లింకులు క్లిక్ చేశారో ఖాతా ఖాళీయే
రంగంలోకి దిగిన అధికారులు, తొలుత బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకు అధికారులకు ఫోన్ చేయగా ఆ డబ్బు కశ్మీర్‌లోని బారాముల్లా పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)లో జుజు అనే వ్యక్తి ఖాతాలో పడ్డాయని చెప్పారు. అనంతరం కశ్మీర్ పీఎన్‌బీకి ఫోన్ చేయగా అక్కడి నుంచి ఐదు వేర్వేరు రాష్ట్రాల్లోని బ్యాంకులకు మళ్లించారని తేలింది. వెంటనే ఆ ఐదు బ్యాంకులకు ఫోన్ చేస్తే అక్కడి నుంచి మరో ఆరు ఖాతాలకు మళ్లించారని తేలింది.
ఆ బ్యాంకు అధికారులకు కూడా ఫోన్ చేసిన అధికారులు, జరిగిన మోసం గురించి వివరించారు. కేసు నమోదు చేస్తున్నామని, ముందుగా అకౌంట్లలోని ఆ డబ్బు ఎవరూ విత్ డ్రా చేయకుండా సీజ్ చేయాలని కోరారు. కానీ అప్పటికే సదరు ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.15 లక్షలు డ్రా చేశారు. పోలీసుల చాకచక్యంతో మిగతా రూ.83 లక్షలు మాత్రం విత్ డ్రా చేసుకోకుండా నిలువరించగలిగారు. సినిమాలో మాదిరి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకే కేసులో పోలీసుల అప్రమత్తతతో ఇంత భారీ మొత్తం రికవరీ చేసి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రికార్డు సృష్టించారు.