Fraudsters Transfer Rs.124 Crores In One Account : దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కాజేసిన కోట్ల రూపాయల సొమ్మును హైదరాబాద్‌లోని బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్న కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ శంశీర్‌గంజ్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లోకి 6 కరెంట్ ఖాతాల్లోకి సైబర్‌నేరాల సొమ్ము బదిలీ కావడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో ఆరింటిలోని ఒకే బ్యాంకు ఖాతాలోకి ఏకంగా రూ.124.25 కోట్లు నగదు బదిలీ అయినట్లుగా తేలింది.
కమిషన్‌కు ఆశపడి బ్యాంకు ఖాతా సమకూర్చిన వ్యక్తి : ‘ప్రొవెన్ ఏహెచ్‌ఎం ఫ్యుజన్’ సంస్థ పేరిట ఉన్న ఈ ఖాతాలోకి మార్చి, ఏప్రిల్ నెలల్లో సొమ్ము జమయ్యింది. ఇది మహ్మద్ బిన్ అహ్మద్ బవజీర్ అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు తేలింది. ఇతడి పేరిటే ఉన్న మరో ఖాతాలోకి రూ.34.19 లక్షలు వచ్చినట్లు వెల్లడి కావడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈక్రమంలో అతడు మ్యూల్ (కమీషన్ కోసం బ్యాంకు అకౌంట్‌ను సమకూర్చడం) అని తేలింది. దుబాయ్‌లో ఉన్న సూత్రధారి సూచనల ప్రకారమే తాము బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు బవజీర్ వెల్లడించడంతో పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. బ్యాంకు అకౌంట్లలోకి వచ్చిన సొమ్మును హవాలా మార్గంతో పాటు ఫారిన్ ఎక్ఛేంజీల ద్వారా విదేశాలకు తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఆరు ఖాతాల్లో రెండు నెలల్లో రూ.150 కోట్ల లావాదేవీలు : మరోవైపు మిగిలిన 5 ఖాతాలూ మ్యూల్స్‌వే అని పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో సూత్రధారి దొరికితేనే కేసు దర్యాప్తు మరింత వేగవంతమయ్యేందుకు అవకాశముంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఖాతాలోకి వచ్చిన రూ.124.25 కోట్ల సొమ్ము 234 నేరాలకు సంబంధించినదిగా ప్రాథమిక దర్యాప్తులో తేటతెల్లమైంది. సాధారణంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)కు వచ్చే కంప్లైంట్లను టీజీసీఎస్‌బీ పోలీసులు విశ్లేషిస్తుంటారు. ఈక్రమంలో శంశీర్‌గంజ్ ఎస్‌బీఐలోని ఖాతాలకు భారీగా సైబర్‌నేరాల సొమ్ము బదిలీ అవుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో టీజీసీఎస్‌బీ పోలీసులు దృష్టి సారించారు. ఈక్రమంలోనే 6 కరెంట్ ఖాతాల్లో రెండు నెలల్లోనే సుమారు రూ.150కోట్ల వరకు లావాదేవీలు జరగడంతో పోలీసులు మరింత లోతుగా ఆరా తీశారు. ఈక్రమంలోనే పెద్దఎత్తున నగదు లావాదేవీలు విషయం వెలుగులోకి వచ్చింది.