Court Sentences Couple To Attend Police Station For 15 Days : మద్యం మత్తులో ప్రమాదానికి పాల్పడి, పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన నిందితులకు న్యాయమూర్తి చిత్రమైన శిక్షను విధించారు. హైదరాబాద్ నగరంలోని వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన వ్యాపారి తీగుళ్లు దయా సాయిరాజ్ (28), మెట్టుగూడకు చెందిన స్నేహితురాలితో కలిసి డిసెంబరు 28న అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌లోని కన్వెన్షన్ సెంటరులో జరిగిన విందుకు హాజరయ్యారు. అనంతరం తిరిగి మారేడ్‌పల్లికి పయనమయ్యారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబరు 1 మలువు వద్ద ఆయన వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. రహదారి అవతలి వైపు దూసుకెళ్లి ఫుట్‌పాత్‌పై నిలిచిపోయింది.
ఉదయం వరకు నానా హంగామా : స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వాహనంతో పాటు వారిద్దరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిద్దరికీ శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించి మద్యం తాగినట్లు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరు మరుసటిరోజు ఉదయం వరకు ఠాణాలో నానా హంగామా చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని డిసెంబరు 29న నాంపల్లి కోర్టు పదహారో అడిషనల్ ఛీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రభాకర్ ఎదుట హాజరుపరిచారు.
15 రోజులు వచ్చేవారందరికి స్వాగతం పలకాలి : న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు. కాగా మద్యం తాగి రహదారి ప్రమాదానికి కారకులు కావడంతో పాటు పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు దయా సాయిరాజ్, ఆయన స్నేహితురాలికి శిక్ష విధించారు. 15 రోజులపాటు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జూబ్లీహిల్స్ ఠాణాకు రావాల్సిందిగా ఆదేశించారు. ఆ సమయంలో వారు రిసెప్షన్లో కూర్చొని వచ్చేవారందరికీ స్వాగతం పలకాలని స్పష్టం చేశారు. సోమవారం నుంచి మూడు రోజులుగా ఠాణాకు వచ్చి రిసెప్షన్ కేంద్రంలో కూర్చుంటున్న నిందితులు సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిద్దని పిలిచి కోర్టు ఆదేశాలను పక్కాగా అమలుపరచాలని మందలించారు. గురువారం ఎప్పటిలాగనే నిందితులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ విషయంపై అక్కడకు చేరుకున్న మీడియాను చూసి ఠాణా వెనుక గేట్ నుంచి పరుగుపెట్టారు.
నగరంలో న్యూ ఇయర్ మత్తు - భారీగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
ట్రాఫిక్ పోలీసులను పరుగులు పెట్టించిన మందుబాబు - Drunker Fight With Police