Phone Tapping Case Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతంగా నడుస్తోంది. ఈకేసులో A4గా చేర్చినటువంటి రాధాకిషన్ రావు(Radhakishan rao) కస్టడీ కోరుతూ, పోలీసులు వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారించింది. రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి 7 రోజుల పాటు రాధాకిషన్‌రావును పోలీసులు ప్రశ్నించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును నిందితులుగా చేర్చిన విషయం తెల్సిందే. ఇదివరకే రాధాకిషన్ రావును విచారించిన పోలీసులు, పలు కీలక విషయాలు రాబట్టారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేసినట్లు, రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో ప్రణీత్‌రావు(Praneeth rao), ఇచ్చిన సమాచారంతో పలువురు నాయకుల డబ్బు సీజ్ చేసినట్లు తెలిపాడు. రాంగోపాల్‌పేట పరిధిలోని ప్యారడైస్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్‌కు చెందిన రూ. 70లక్షలు సీజ్ చేశారని, ఆ సమయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఆయన పోటీ చేస్తున్నట్లు తెలిపాడు.
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావుకు పంపినట్లు తెలిపాడు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రఘునందన్‌రావు బంధువులకు చెందిన కోటి రూపాయలను రాధాకిషన్‌రావు అతని బృందం బేగంపేట పరిధిలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు. మునుగోడు ఉపఎన్నికల సమయంలోనూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరులు అయిన గుంట సాయికుమార్‌రెడ్డి, మహేష్, వెన్నం భరత్‌లను అడ్డగించి వారి నుంచి రూ. 3.50 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు. ఎన్నికల డబ్బును టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో తరలించినట్లు పేర్కొన్నాడు.
హార్డ్‌డిస్క్‌ల స్వాధీనం.. మరోవైపు డిసెంబరు 4వ తేదీన మూసీ నదిలో హార్డ్‌డిస్కులను పడేసినట్లు A1 ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో, నాగోలు వద్ద మూసీలో హార్డ్‌డిస్క్ శకలాలను పోలీసులు సేకరించారు. మూసీ వద్ద 5 హార్డ్ డిస్క్ కేసులు, 9 హార్డ్‌డిస్క్ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 6 మెటల్ హార్డ్‌డిస్క్ ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎస్‌ఐబీ(SIB) కార్యాలయంలోనూ పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. ఎస్‌ఐబీ కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ప్రణీత్‌రావు బృందం వాడిన ల్యాప్‌టాప్, మానిటర్లను స్వాధీనం చేసుకున్నారు.