Couple Commits Suicide Due to Debts : పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. పిల్లలను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. అయితే కొందరు పిల్లలు అడ్డదారులు తొక్కుతూ తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తున్నారు. వారి జీవితాలను నాశనం చేసుకోవటమే కాక అందినకాడికి అప్పులు చేస్తూ తల్లిదండ్రుల చావుకు కారణమవుతున్నారు. ఇలాంటి ఘటనే నంద్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కుమారుడి కోసం చేసిన అప్పులు తీర్చలేక విషం తాగి రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి(48), ప్రశాంతి(42) దంపతులకు ఒక కుమారుడు నిఖిలేశ్వర్ రెడ్డి ఉన్నాడు. హైదరాబాద్లో ఉంటూ బిజినెస్ చేస్తున్నానని తల్లిదండ్రులను నమ్మించి విపరీతంగా అప్పులు చేయించాడు. కుమారుడి కోసం ఆ దంపతులు దాదాపు 2 కోట్ల 40 లక్షల రూపాయల వరకూ అప్పులు చేశారు. అయితే కుమారుడు ఆ నగదును ఇష్టమొచ్చినట్లు దుబారా చేస్తున్నాడనే విషయం ఆ తల్లిదండ్రులు గ్రహించలేకపోయారు.
తీరా అప్పు ఇచ్చినవాళ్లు డబ్బు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేశారు. అప్పులు తీర్చే దారి లేక ఇల్లు, పొలాన్ని అమ్మేశారు. అయినా ఇంకా సగం అప్పులు మిగిలే ఉన్నాయి. మిగిలిన డబ్బు కూడా చెల్లించాలని అప్పు ఇచ్చినవాళ్లు వేధించడంతో ఇంకో పొలాన్ని అమ్మకానికి పెట్టారు. అయితే అది తక్కువ ధరకు అడగటంతో అప్పులు తీర్చేందుకు ఏం చేయాలో తెలియక తీవ్రంగా సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దంపతులు గత ఆరు నెలలుగా గ్రామాన్ని విడిచి వెలుగోడులోని అత్తామామల వద్ద ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి దంపతులు మృతి చెందారు.
"అబ్దుల్లాపురం గ్రామ సమీపంలోని ఆర్చి సమీపంలో పొలంలో మహేశ్వర్ రెడ్డి, ప్రశాంతి అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టగా కుమారుడు తల్లిదండ్రులను మోసం చేసి అప్పులు చేయించినట్లు తెలిసింది. దీంతో ఇల్లు, కొంత పొలాన్ని అమ్మి కొన్ని అప్పులు తీర్చేశారు. ఇంకా కొంత అప్పులు మిగిలి ఉండటంతో మిగిలిన పొలాన్ని కూడా అమ్మేసి అప్పులు తీర్చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ పొలం అనుకున్న దానికంటే తక్కువ ధర పలకడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు." - రామాంజి నాయక్, డీఎస్పీ
మెదక్ జిల్లాలో దారుణం - పోలీస్ కేసు, ఒంటరితనంతో తల్లీకుమార్తెల ఆత్మహత్య!