National Highway- 16 Near By Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కలుపుకుంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లో గురువారం జాతీయ రహదారుల పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే హైవే-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కితాబిచ్చారు.
వినుకొండ - గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25 కిలోమీటర్లు పొడిగిస్తూ, రాజధాని అమరావతిని తాకేలా ప్రణాళిక రూపొందిందని తెలిపారు. ఈ జాతీయ రహదారి రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. గుంటూరుకు మరో ఔటర్ రింగ్ రోడ్డులా మారుతుందని, దీన్ని పూర్తిగా ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ, విద్యుత్తు తదితర పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రాబోయే రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తవుతుందని ఆయన వివరించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు.
Hyderabad Srisailam Road Expansion : ఆ రహదారి విస్తరణ.. పర్యావరణానికి పెనుముప్పు
రైతులను మోసగించిన వారిపై కఠిన చర్యలు : మరోవైపు నకిలీ పత్రాలు సృష్టించి అన్నదాతల పేరిట రుణాలు తీసుకుని మిర్చి రైతుల్ని మోసం చేసిన కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు మిర్చిని గుంటూరుకు తీసుకువచ్చి, మంచి ధర కోసం శీతల గోదాముల్లో దాచుకుంటే ఓ కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు మోసానికి పాల్పడటం దారుణమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకోవడం బాధను కల్గించిందని అన్నారు.
మిర్చి రైతులను మోసం చేసిన వారిని అరెస్ట్ చేశామన్న కేంద్ర మంత్రి కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుల ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. రైతుల్ని మోసం చేయడమే కాకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు కావాలనే ఆత్మహత్య నాటకానికి తెర తీశారని మండిపడ్డారు. ఆసుపత్రి వర్గాలు సైతం అలాంటి వారికి సహకరించవద్దని సూచించారు. రుణాలు తీసుకుని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు.
NHAI : నెల రోజుల్లో రీజినల్ రింగ్ రోడ్డు డీపీఆర్ కన్సల్టెన్సీ ఖరారు