Telangana Congress Lok Sabha Candidates 2024 : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో బుధవారం దిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్రంలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్ రెడ్డిని బరిలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసిన ఓటమి పాలైన సీనియర్ నేత జీవన్‌రెడ్డిని నిజామాబాద్ నుంచి పోటీ చేయించడంపై సీఈసీలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇక మిగిలిన ముగ్గురు అభ్యర్థులు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.
Telangana Congress MP Candidates List 2024 : పటాన్‌చెరు కాంగ్రెస్ టిక్కెట్ దక్కినట్లే దక్కి చివరకు చేజారిన నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు ఈసారి బీసీ కోటాలో మెదక్ టిక్కెట్ ఖరారైంది. ఇక ఆదిలాబాద్ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణకు అవకాశం దక్కింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గుగా ఉన్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రమైన పోటీ మధ్య భువనగరి టిక్కెట్ దక్కించుకున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో కలిపి మొత్తం 13 స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల్ని ప్రకటించింది.
మిగిలిన నాలుగు స్థానాలపై పీటముడి : ఖమ్మం, వరంగల్, కరీనంగర్, హైదరాబాద్ స్థానాలపై పీటముడి పడినట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానం కోసం విపరీతంగా పోటీ ఉంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు, ముఖ్యనేతలు టిక్కెట్ ఆశిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, ఆయన వియ్యంకుడు రఘురామిరెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్, స్థానిక నాయకులు రాజేంద్రప్రసాద్, లోకేశ్‌యాదవ్ పేర్లు సీఈసీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. తీవ్రమైన పోటీ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థి అధిష్ఠానానికే అప్పగించింది.
Telangana Lok Sabha Elections 2024 :హైదరాబాద్ నుంచి మస్కతీ అలీ, షహనాజ్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేర్లను పరిశీంచినట్లు సమాచారం. కరీంనగర్ టికెట్ కోసం కూడా తీవ్రమైన పోటీ ఉంది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రవీందర్‌రావు, తీన్మార్ మల్లన్న పోటీపడుతున్నట్లు సమాచారం. వరంగల్ స్థానానికి దొమ్మాటి సాంబయ్య పేరును రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించినా సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సహా పరంజ్యోతి, నెమిండ్ల శ్రీనివాస్ పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. మరోసారి సర్వేలు నిర్వహించడం సహా అన్ని రకాలుగా అభిప్రాయ సేకరణ చేసి మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని సమాచారం.