Congress MP Mallu Ravi On Rythu Runa Mafi : రైతుల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రైతు బాంధవుడిగా కాంగ్రెస్ ఎంపీలు కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో రుణమాఫీ చేశారంటూ ఎంపీ మల్లు రవి తెలిపారు. రేవంత్‌రెడ్డి సేవలను ఇతర రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకునేలా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తామని మల్లు రవి వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదు గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు.
తెలంగాణ మోడల్‌గా చేయాలి : గత ప్రభుత్వం రైతులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ రైతులను మోసం చేసిందని తెలిపారు. గత ప్రభుత్వంలో కుటుంబ పాలన జరిగిందని విమర్శించారు. బీజేపీ గుజరాత్ మోడల్ అంటుందని దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో రుణమాఫీ చేశారని తెలిపారు. భారత దేశంలో తెలంగాణ మోడల్‌గా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తామని మల్లు రవి వెల్లడించారు.
"తెలంగాణలో ఐదు గ్యారెంటీలు అమలు చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో రుణమాఫీ చేశాం. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. భారత దేశంలో తెలంగాణ మోడల్‌గా చేయాలని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తాం. గత ప్రభుత్వం రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదు. కుటుంబ పాలన మాత్రమే ఉండేది." -మల్లు రవి, ఎంపీ
తెలంగాణ రైతు రుణాల మాఫీ : ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు రుణవిముక్తి కల్పించింది. తొలివిడతలో లక్ష లోపు రుణాల మాఫీకి రూ.6,098 కోట్లను సర్కార్ అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది. రుణమాఫీతో మొదటి దఫా 10లక్షల 84, 50 కుటుంబాలకు చెందిన రూ.11లక్షల 50, 193 మంది కర్షకులకు లబ్ధిచేకూరినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
నల్గొండ జిల్లాలో అత్యధికంగా రూ.454 కోట్లకు పైగా రుణాలు మాఫీ కాగా అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో పన్నెండున్నర కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ప్రభుత్వం రుణమాఫీ నిధులు మంజూరు చేయడంతో రైతులు ఆనందంతో కృతజ్ఞతలు చెబుతున్నారు. చాలాచోట్ల అన్నదాతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి తమ కష్టాలను తీర్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.