Congress Leaders Donations For Flood Victims : రాష్ట్రంలో వరద బాధితులకు అండగా సీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువ కొనసాగుతోంది. జలవిలయంతో అల్లాడిన ప్రజలకు పలువురు వ్యక్తులు, సంస్థలు మానవత్వంతో ముందుకువచ్చి ఆర్థికంగా చేయూతనిస్తున్నాయి. ఈ క్రమంలోనే వరద బాధితుల సహాయార్థం కాంగ్రెస్ విరాళం ప్రకటించింది.
ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు రెండు నెలల వేతనాన్ని వరద బాధితుల సహాయనిధికి అందజేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సూచనల మేరకు విరాళం అందిస్తున్నట్టు తెలిపారు.
లారీలో పదివేల కిట్లను ఖమ్మం పంపించిన హైసియా : మరోవైపు ఖమ్మం వరద బాధితుల సహాయం కోసం హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా), స్వచ్ఛంద సంస్థలు నిత్యావసర సరుకుల కిట్లను సిద్ధం చేశాయి. ఒక్కో కిట్ సుమారు రూ.3 వేలు విలువ ఉంటుందని హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ పేర్కొన్నారు. మొత్తం 10వేల కిట్లను వరద బాధితుల కోసం సిద్ధం చేసిన లారీలో పంపిణీకి ఏర్పాటు చేశారు.
ఈ లారీని సచివాలయం వద్ద మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో హైసియా అధ్యక్షుడు ప్రశాంత్, సభ్యులు భరణి సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు, అనుకోని విపత్తు వల్ల బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలు సైతం ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకు రావటం హర్షణీయమన్నారు.
వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించిన క్రెడాయ్ : వరద బాధితులకు బాసటగా క్రెడాయ్ సంస్థ భారీ మొత్తంలో విరాళం ప్రకటించింది. సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం క్రెడాయ్ ప్రతినిధులు అందించారు. ఈమేరకు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసిన క్రెడాయ్ ప్రతినిధులు చెక్కును అందించారు. అదేవిధంగా వరద బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు కురుమ సంఘం ఆధ్వర్యంలో రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి విరాళాన్ని అందించారు. కురుమ సంఘ ప్రతినిధులు వెంట భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం తదితరులు ఉన్నారు.