Congress Leaders Comments On BRS MLA Joinings : హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని రగిలిస్తున్నాయి. 20 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి పని చేసిన తమను కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తమకు అన్యాయం చేయడమేనని నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో కొనసాగాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిందేనంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు నియోజకవర్గ స్థాయి నేతలకు నచ్చజెబుతున్నారు. అయినా కొంత మంది నాయకులు ఆందోళనలకు సిద్ధపడుతుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి సంబంధిత నాయకులతో మాట్లాడి కాంగ్రెస్ నాయకులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం : బీఆర్ఎస్ గెలిచిన సీట్లలో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 18 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో ఇప్పటి వరకు ముగ్గురు కాంగ్రెస్‌లో చేరారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు రేపోమాపో చేరడానికి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కూడా చేరేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలతో సంబంధిత నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులన్నా వస్తాయని ఆశతో ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో సంబంధిత నియోజకవర్గాల్లో తమ పాత్ర ఉండదని, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు వారి అనుచరులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు.
బుజ్జగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి : ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనపై పోటీ చేసి ఓడిన విజయారెడ్డి మండిపడ్డారు. దీంతో తగిన న్యాయం చేస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి 282 ఓట్లతో ఓడిపోయిన భీంభరత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయను సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగింజినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యాదయ్యతో స్థానిక కాంగ్రెస్ నేతలు పెద్దగా కలవడం లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలే ఆయనతో ఉంటున్నారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. శేరిలింగంపల్లితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.