Shabbir Ali hot comments on KTR : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్(KTR) జైలుకు వెళ్లడం ఖాయమని, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల తర్వాత, బీఆర్ఎస్ పార్టీ కనుమరుగడం ఖాయమన్నారు.
Shabbir Ali fires on BRS : గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన కవిత లిక్కర్ స్కామ్‌తో పాటు, ఇతర అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్(Phone tapping) చేసి భార్యాభర్తల సంభాషణలు వినడం సిగ్గు చేటన్నారు. ఏకంగా తాము ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమేనని, పోలీసు అధికారులే అంగీకరించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుందని, దుబ్బాక, మునుగోడు ఉపఎన్నికల్లో ప్రభుత్వ వాహనాల్లో నగదు రవాణా చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు ఒప్పుకున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అయిదు గ్యారంటీలను అమలు చేశామన్నారు. యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే 30వేల ఉద్యోగాల భర్తీ చేసినట్లు తెలిపారు. మరో 20 వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయని, మెగా డీఎస్సీ వేసినట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీతో యువత అనందంగా ఉందన్నారు.
ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రైతు రుణమాఫీకి, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే రైతు రుణాలను మాఫీ చేస్తామని, ప్రభుత్వానికి ఆదాయం సమకూరిన వెంటనే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉందన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందని తెలిపారు. బీజేపీ, దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఉసిగొల్పుతోందన్నారు.
"బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు. భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారు. నిజంగా వారికి సిగ్గుచేటు. దుబ్బాక, మునుగోడు ఉపఎన్నికలకు ప్రభుత్వ వాహనాల్లో డబ్బు తరలించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులే అంగీకరించారు. ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం". - షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారు
సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ అంటే బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమేనా? : షబ్బీర్ అలీ
సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు అమలయ్యే బాధ్యత మాది : షబ్బీర్ అలీ