Harish Rao Talk About Veterinary Staff : రాష్ట్రంలో పశు వైద్య సంచార అంబులెన్స్ సేవల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు గానూ మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన 1962 పశు వైద్య సంచార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయమని హరీశ్‌రావు విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు సైతం పొంది దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన గొప్ప కార్యక్రమ నిర్వహణను గాలికి వదిలేసి మూగజీవుల రోదనకు కారణమవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు వాహనాల్లో మందుల కొరత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మూగజీవుల ప్రాణాలు కాపాడాలనే సదాశయం నీరుగారిపోతుండగా, మరోవైపు వాహన డ్రైవర్, డాక్టర్, ఇతర సిబ్బందికి వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారని, వారి కుటుంబ పోషణ భారంగా మారి ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి 1962 వాహనాల్లో మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ సిబ్బందికి 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
మూసీ బాధితులకు అండగా : హైడ్రా బాధితులకు అండగా ఉంటామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. పేదల ఇళ్లు కూలగొట్టే ముందు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో నిర్మించిన ఇల్లు, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి మాదాపూర్‌లో ఉన్న నివాసాలను తొలగించాలని డిమాండ్ చేశారు. మూసీ అభివృద్ధి పేరిట చేస్తున్న ప్రక్రియను హరీశ్ రావు ఖండించారు. బాధితుల సమస్యను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో మూసీ పరివాహక ప్రాంతాలను ఆదివారం సందర్శించారు. మూసీ నది అభివృద్ధిలో భాగంగా చేపట్టిన కూల్చివేతలలో ఉన్న ఇళ్ల బాధితులు హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్ వద్ద తెలంగాణ భవన్లో వారి గోడును చెప్తు కంటతడి పెట్టారు. పేదల కన్నీళ్లతో మూసీ నీరు అభివృద్ధా అని హరీశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు ధైర్యంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.