Addanki Dayakar Reaction KCR Letter : విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణాలు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై జరుగుతున్న న్యాయ విచారణపై మాజీ సీఎం కేసీఆర్ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. తన పేరును బదనాం చేస్తున్నారని కేసీఆర్ పేర్కొనడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ఏ శాఖలో విచారణ జరిగినా అక్కడ మాజీ సీఎం పేరు ప్రస్తావన వస్తోందని విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్తు కొనుగోళ్లలో జరుగుతున్న విచారణలో మాజీ సీఎంకు నోటీసులు ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించారు. విచారణ కమిషన్ ముందుకు రాకుండా లేఖ రాయడం ఏమిటని నిలదీశారు. ప్రజలకు వాస్తవాలు తెలియచేసేందుకే న్యాయ విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. విచారణ ముందుకు సాగకుండా అడ్డుకునేందుకే బెదిరింపు దోరణిలో లేఖ రాశారని ఆరోపించారు.
MLC Mahesh Kumar Goud Comments On KCR : మరోవైపు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్‌గౌడ్ మాజీ సీఎం కేసీఆర్ లేఖపై తీవ్రంగా మండిపడ్డారు. తాను చేసిన తప్పులు బయట పడతాయన్న భయం కేసీఆర్‌కు మొదలైందని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయనట్లయితే కమిషన్ ముందు ఎందుకు హాజరవడం లేదని ప్రశ్నించారు. 12 పేజీలు లేఖ రాయాల్సిన పని ఏముందని నిలదీశారు. విద్యుత్తు కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అక్రమాలు బయటకు రావాల్సి ఉందని వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాల్సి ఉందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణంలో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో వివరణ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విచారణ కమిషన్ ఇప్పటికే నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. గడువు నేటితో ముగుస్తుండటంతో జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డికి కేసీఆర్ 12 పేజీల సుధీర్ఘ లేఖ రాశారు. రాజకీయ కక్షతో తనను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ అంశాలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్షేపించారు. గత ప్రభుత్వ విజయాలను తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.