Coal Mines Retired Employees : దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల పింఛనుదారులకు కొత్త సమస్య వచ్చిపడింది. 2031వ సంవత్సరం నాటికి చెల్లింపులకు కొరత ఏర్పడనుంది. చివరకు పింఛను ఫండ్ మూలధనం కదిలించాల్సిన గడ్డు పరిస్థితి ఏర్పడనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ప్రతినిధులు, కోల్‌మైన్స్ పెన్షన్ స్కీం ఉన్నతాధికారులు ఇటీవల దిల్లీలో సమావేశమయ్యారు. తదుపరి భేటీలో సింగరేణి సీఎండీ, కోల్ ఇండియా అధికారులతో చర్చించి తుది నిర్ణయానికి రావాలని తీర్మానించారు.
సమస్య భారీ వేతనాలే? : కోల్‌మైన్స్ పెన్షన్ స్కీం 1998 నుంచి అమలవుతోంది. సింగరేణి, కోల్ ఇండియా విశ్రాంత ఉద్యోగులు ఈ పింఛను పథకం వర్తిస్తుంది. ఉద్యోగుల మూలవేతనం, కరవు భత్యం(డీఏ)లోని 7 శాతానికి, ఉద్యోగుల యాజమాన్యాలు అంతే మొత్తాన్ని కలిపి పింఛను నిధికి జమ చేస్తున్నాయి. 2017 వరకు పింఛను పథకానికి తక్కువ మొత్తంలోనే జమయ్యేది. ఈ మొత్తాన్ని పెంచాలని నాలుగేళ్ల క్రితం నిర్ణయించారు.
ఒక టన్ను బొగ్గు అమ్మితే వచ్చిన దానిలో రూ.10 చొప్పున ఉద్యోగుల పింఛను నిధికి జమచేస్తున్నారు. ఇలా చేస్తే పథకం నిర్వహణకు ఢోకా ఉండదని భావించారు. పెరుగుతున్న వేతనాలు, జీవనకాలం, ఉద్యోగ విరమణల నేపథ్యంలో 2031 నాటికి పింఛను పథకం నిల్వల్లో లోటు ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. ఈ సమస్య ప్రస్తుతం పింఛను పొందుతున్న వారినే కాకుండా, సింగరేణిలో 42 వేల మంది ఉద్యోగులు, కోల్ ఇండియాలో 2.5 లక్షల మంది ప్రస్తుత ఉద్యోగులనూ ప్రభావితం చేయనుంది.
పింఛను పెరుగుదలతో : కోల్ ఇండియా, సింగరేణిలో గత ఐదారు దశాబ్దాలతో పోల్చుకుంటే ప్రస్తుతం వేతనాలు భారీగా పెరిగాయి. వేతన సవరణలతో పాటు చెల్లించాల్సిన పింఛను మొత్తమూ కూడా క్రమంగా పెరుగుతోంది. మున్ముందు మరికొన్ని వేతన సవరణ (పీఆర్సీ)లు రానున్నాయి. వచ్చే ఏడేళ్లలో పింఛను మొత్తాలూ పెరుగుతాయి. దీనివల్ల పథకానికి జమయ్యే మొత్తం కన్నా, చెల్లింపులే అధికం కానున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో తగిన పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నామని సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం తెలిపారు.