CM Revanth On Floods in Telangana : తెలంగాణలో గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ జిల్లాల్లో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికీ ముంపు ప్రాంతాల్లోనే చాలా గ్రామాల ప్రజలున్నారు. వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఖమ్మం జిల్లాకు పయనమయ్యారు.
CM Revanth On Suryapet Floods : అయితే మార్గమధ్యలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆగి అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం నగరానికి బయల్దేరిన సీఎం మార్గ మధ్యలో సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో ఆగారు. అక్కడి వరద ప్రభావిత ప్రాంతాల గురించి అధికారులను ఆరా తీశారు. వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. సాగర్ ఎడమకాల్వ తెగడంతో జరిగిన పంట నష్టం పై ఆరా తీశారు.
"సూర్యాపేట జిల్లాలో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడింది. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పంట, ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం నిరంతరం మంత్రులు,ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం. ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఖమ్మం,నల్లగొండ పరిస్థితి పైన ప్రధాని మోదీ, అమిత్ షా,రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరాను. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం. వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు. వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు." - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో దిల్లీ వెళ్తారు కానీ వరదల సమయంలో మాత్రం సాయం చేయరని బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ పరోక్ష విమర్శలు చేశారు. మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని, మూడ్రోజుల నుంచి నిద్ర లేకుండా తాను సమీక్షలు జరుపుతున్నానని తెలిపారు. వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని ఆహ్వానించామని వెల్లడించారు. రాష్ట్రంలో ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయని, తక్షణమే కేంద్రం రెండు వేల కోట్లు కేటాయించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పని చేయాలని కోరారు.
భారీ వర్షాలకు కూలిపోయిన బ్రిడ్జిలు - నిలిచిన రాకపోకలు - Bridge washed away by rains in tg