CM Revanth Serious about Handcuffs To Farmer : లగచర్ల రైతు హీర్యానాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని స్పష్టం చేశారు. హీర్యానాయక్ అంశంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
పేషెంట్ కండీషన్ నిలకడగా ఉంది : మరోవైపు హీర్యానాయక్‌కు మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి నుంచి గాంధీకి అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ బీరప్ప స్పందించారు. పేషెంట్ కండిషన్ నిలకడగా ఉందని తెలిపారు. ఈసీజీ, 2D ఎకో, బీపీ, అన్నీ చెక్ చేశామన్న ఆయన అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని వెల్లడించారు. సీఎం ఆఫీస్ నుంచి మెరుగైన వైద్యం అందించాలని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని ఆయన తెలిపారు. జనరల్ ఫిజీషియన్స్ డాక్టర్, కార్డియాలజీ వైద్యులతో పేషెంట్‌కు చికిత్స అందిస్తున్నామని వివరించారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి : లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వెనక్కి తీసుకున్న సర్కార్, రైతుల పైనా పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. మరోవైపు తమ బిడ్డకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హీర్యానాయక్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు స్పందించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..? అని నిలదీశారు. రైతుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా ఎలా వ్యవహరిస్తారని ఆక్షేపించారు.
మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా స్పందించారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్ కు గుండెనొప్పి వస్తే బేడీలు వేసి జైలు నుంచి ఆసుపత్రికి తరలించడం క్షమార్హం కాదని కేటీఆర్ మండిపడ్డారు. అంబులెన్స్ లో తీసుకురావాల్సిన వ్యక్తిని బేడీలు వేసుకొని తీసుకొని రావడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు.
ఇదీ జరిగింది : లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న హీర్యానాయక్‌ను సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షలు చేసే సమయంలో ఛాతినొప్పి వచ్చింది. దీంతో అతడిని మొదట సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్సను అందించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ హీర్యానాయకు గుండెపోటు రావడంతో పంజాగుట్ట నిమ్స్‌కు తరలించారు.
'మహిళా పోలీసులు ఉన్నారా ? అరెస్టు చేసిన వారిని కొట్టారా ?' - లగచర్ల ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ