CM Revanth Reddy Delhi Tour : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ వెళ్లారు. శనివారం దిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అంతేకాకుండా ఇండియా కూటమి పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా రాహుల్ గాంధీని ఎన్నుకోవడంతో పాటు, ఆయనను కలిసి అభినందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముందు రోజే దిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ రాత్రి కానీ, రేపు ఉదయం కానీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం సమావేశమై, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం దిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎంతో పాటు సభ్యురాలిగా దీపాదాస్ మున్షీ, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్ రెడ్డి, శాశ్వత ఆహ్వానితుడు దామోదర్ రాజనర్సింహులు హాజరు కానున్నారు.
TPCC Focus On Nominated Posts Appointments : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీ మేరకు పార్టీ కోసం పని చేసిన నాయకులకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టే పనిలో పడింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులు అవిశ్రాంతంగా పని చేశారు. అభ్యర్థుల గెలుపునకు కొంతమంది పని చేస్తే, మరికొందరు నాయకులు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేశారు.
ఇంకొంత మంది శాసనసభ టికెట్లు ఆశించి, నిరాశకు గురైన నాయకులు కూడా ఉన్నారు. అందులో భాగంగానే రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే నలుగురు సలహాదారులతో పాటు టీ-శాట్ సీఈవో, ఆర్థిక కమిషన్ ఇలా కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. మరో 37 నామినేటెడ్ ఛైర్మన్ పోస్టుల భర్తీ కూడా లోక్సభ ఎన్నికల ముందు జరిగింది. కానీ ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో వారెవరూ విధుల్లో చేరలేదు.
గురువారంతో కోడ్ ముగియడంతో గవర్నమెంట్ కార్యకలాపాలతో పాటు పాలనా వ్యవహారాలు కూడా ఇవాళ్టి నుంచి ఊపందుకున్నాయి. వందకు పైగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ఉండగా, ఇప్పటి వరకు 50లోపే భర్తీ కాగా, మిగిలినవి భర్తీ చేయాల్సి ఉంది. కొత్తగా పార్టీలో చేరిన వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి ఎలాంటి నామినేటెడ్ పోస్టులు లేవని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీటన్నింటిపై సమగ్రంగా చర్చించి, కీలక నిర్ణయాలను తీసుకునేందుకు సీఎం దిల్లీ పర్యటనకు వెళ్లారు.
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు: సీఎం రేవంత్‌రెడ్డి - Telangana Talli Celebrations 2024