CM Revanth Reddy Serious Warning to Police Department : పోలీసుశాఖలో ఇకపై రాజకీయ పోస్టింగులు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల అధికారులతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. డబ్బులిచ్చి పోస్టులు కోసం ప్రయత్నించొద్దని పోలీసులను సీఎం రేవంత్ హెచ్చరించారు. అలాంటి వారిని ఏసీబీ, విజిలెన్స్ వెంటాడుతాయని తేల్చిచెప్పారు. రాజకీయాలకంటే నేరాల నియంత్రణపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని కోరారు. ప్రతిభ, పనిలో సామర్థ్యం ఆధారంగానే పోస్టింగులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇందుకు ఉదాహరణ టీజీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా పదవీకాలం పొడిగింపేనని చెప్పారు.
ప్రస్తుతం పోలీసులపై సమాజంలో ఉన్న అభిప్రాయాలు మారాలన్నారు. తమవారు పోలీసులని గర్వంగా చెప్పుకునేలా పనితీరు కనబరచాలని కోరారు. తన సోదరుడు భూపాల్‌రెడ్డి వనపర్తిలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ తనను చదివించారన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన చూపిన బాటలోనే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో విస్తృతమైన డ్రగ్స్, గంజాయి వల్ల రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి రాష్ట్రానికి గంజాయి వస్తోందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ప్రవేశించకూడదని పోలీసులకు సీఎం స్పష్టం చేశారు.
డ్రగ్స్ కట్టడికి సైనికుడిలా పోరాడాలి : దేశం కోసం సరిహద్దుల్లో గస్తీ కాసే సైనికుడిలా రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి పహారా కాయాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు ఉందని, అందుకే ఉగ్రవాద కదలికలు సహా ఇతర సమాచారం కోసం ఎస్ఐబీ సమాచారం కోరతారని సీఎం తెలిపారు. నేరగాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ నేరాలను నియంత్రించకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. పోలీసులు తమ బాధ్యతను గుర్తుపెట్టుకొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కాపాడాలని కోరారు.
రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించండి : పోలీసులు రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాలపై నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలే మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారని తమకు మితిమీరిన సెక్యూరిటీ అవసరం లేదని అన్నారు. ఎవరికీ ఎంత అవసరమో అంతే భద్రత కల్పించాలన్నారు. భద్రత విషయంలో తనతో సహా ఎవరికీ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని డీజీపీకి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలీసుల పిల్లల కోసం సైనిక స్కూళ్ల మాదిరే స్కూళ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో పోలీసు పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అక్కడ అందుబాటులో ఉంటుందన్నారు. హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు చదువుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.