CM Revanth Reddy is Dissatisfied with Performance of Collectors : ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా, ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో 29 విభాగాల ముఖ్యకార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ సమావేశం నిర్వహించారు. అధికారులందరూ తప్పనిసరిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రజా పాలనను అందించేందుకు అధికారులు అందరూ బాధ్యతగా, కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని సీఎం చెప్పారు. తమ శాఖల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన చేసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రతీ అధికారి కనీసం ఫ్లాగ్షిప్ ఐడియాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.
CM Revanth Focus on State Development : ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వహించాలని, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని కోరారు. అధికారులందరూ ఏకతాటిపై పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ తమ విభాగాలపై పట్టు సాధించాలని సీఎం చెప్పారు. సుపరిపాలనను అందించేందుకు అధికారులు క్రమశిక్షణ పాటించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. రోజూ నిర్ణీత సమయంలో సచివాలయానికి రావాలని ముఖ్య కార్యదర్శులకు రేవంత్ రెడ్డి కోరారు.
చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదు : కేవలం ఆఫీసులకు పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒక రోజు జిల్లాలకు క్షేత్ర పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, సంబంధిత విభాగం చేపట్టిన కార్యక్రమాలు, పనుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. చాలా జిల్లాల్లో కలెక్టర్లు కార్యాలయాలు దాటి బయటకు వెళ్లడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
కలెక్టర్లు కచ్చితంగా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ విభాగాలన్నింటినీ సందర్శించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు, అనూహ్య సంఘటనలు, దుర్ఘటనలనలపై అధికారులు వేగంగా స్పందించాలని కోరారు. అధికారులపై వ్యక్తిగతంగా రాగద్వేషాలు లేవని, కేవలం పనితీరు ఆధారంగానే అధికారులకు ఉన్నత అవకాశాలుంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
CM Revanth District Tour Schedule : అనవసరమైన సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలోనే వారానికి ఒక జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్లు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలను స్వయంగా కలిసి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
త్వరలోనే తన జిల్లా పర్యటనల షెడ్యూలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమీక్షలో పాల్గొన్నారు. మొత్తం 29 విభాగాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.