CM Revanth Reddy on Rythu Runa Mafi : రైతు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, పాస్ బుక్ ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని కేవలం పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన రెండు రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగిందన్నారు. ఆర్టీసికి ప్రతి నెలా రూ.350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. దిల్లీలోని మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఈ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పామని వివరించారు. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలకు మించి బడ్జెట్ ఉండకూడదని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. బడ్జెట్ వ్యవహారంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల పెరిగిన రెవెన్యూ : మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీకి ప్రతి నెల రూ.350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. 30 శాతం నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెరిగిందని చెప్పారు. దీనివల్ల ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయన్నారు. గత అప్పులతో సంబంధం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తోందన్నారు.
అలాగే రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్న సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రైతు రుణమాఫీ తరవాత రైతు బంధు ఇతర పథకాలపై దృష్టి పెడతాం. మండలాలు రెవెన్యూ డివిజన్ విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ సమావేశాల తరవాత కమిషన్ నియమిస్తాం. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టులో పూర్తవుతుంది. కొత్తవారిని నియమించిన తరవాత కులగణన చేస్తాం.
ప్రతి నెల రూ.7వేల కోట్లు కడుతున్నాం : కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలు అసెంబ్లీ ముందుకు తెస్తాం. చర్చల తరవాత డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు ముందుకు వెళతాం. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. మరో లక్ష కోట్ల వరకు పెండింగ్ బైల్స్ ఉన్నాయి. నెలకు రూ.7 వేల కోట్లు అప్పులు కడుతున్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు నెలకు రూ.6,500 కోట్లు కట్టేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలు తక్కువ వడ్డీకి మార్చుకునే పనిలో ఉన్నాం. ఇందుకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాం. 7 నుంచి 11 శాతం వడ్డీ వరకు రుణాలు తీసుకువచ్చారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించాం. అన్ని శాఖలకు సంబంధించిన రాష్ట్రమంత్రులు కేంద్రమంత్రులను ఇప్పటికే ఒకసారి కలిశారు. బడ్జెట్‌కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలు కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నాం. పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి తప్ప బంగారం పై తీసుకున్న రుణాలకు కాదని సీఎం స్పష్టం చేశారు.
మహిళకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఓకే : మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షు ఎంపికపై చర్చలు ప్రారంభమయ్యాయి. పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి. ఎవరికి పీసీసీ అధ్యక్షు పదవి ఇవ్వాలి అనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారు. పీసీసీ రేసులో ఎవరైనా ఉండొచ్చు. ఈ ఎంపికలో సామాజిక న్యాయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఈబీసీల్లో ఎవరినైనా ఎంపిక చేయవచ్చు. మహిళకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న ప్రశ్నకు, ఇస్తే బాగుంటుందని సీఎం చెప్పారు. కాంగ్రెస్ బీ ఫారం మీద గెలిచిన వారికే మంత్రి పదవుల్లో స్థానం ఉంటుంది.
ఫిరాయింపులు తెలంగాణలో మాత్రమే కాదు : ఫిరాయింపులకు తెలంగాణ ఒక్కటే ప్రత్యేకం కాదు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు ఫిరాయించారు. నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలతో ఏకంగా పార్టీనే బీజేపీ విలీనం చేసుకుంది. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదు. అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలి తప్ప సంపన్నులకు కాదు. మోదీ పదేళ్లలో రూ.16 లక్షల కోట్లు కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఎవరు ప్రశ్నించరు. కానీ మహిళలు, రైతులకు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారు.