Lok Sabha Elections 2024 : బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ అంతర్గతంగా కుట్రలు చేస్తోందని, ఓటు బీజేపీకి వేసినా బీఆర్ఎస్కు వేసినా ఒక్కటేనని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు వందరోజుల్లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తానని కవిత హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రైతులకు మాట ఇచ్చి మోసం చేస్తే బండకేసి కొడతామని, నిజామాబాద్ రైతులు నిరూపించారని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజాామాబాద్, ఆర్మూర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ఎన్నికల ముంగిట పసుపుబోర్డు ప్రకటన చేశారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్, యూపీలో ప్రకటన చేస్తే, పదేళ్లు నెరవేరకుండా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. మన ప్రాంత ప్రజలంటే మోదీకి చులకనని, సులువుగా మోసం చేయొచ్చని భావిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్మూర్‌కు కనీసం మున్సిపాలిటీ కార్యాలయం కూడా తేలేదని, నిజామాబాద్, ఆర్మూర్‌ను ఇక్కడి నేతలే మోసం చేశారని దుయ్యబట్టారు.
పంజాబ్, హరియాణా రైతులు మోదీ మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేయించారని, నిజామాబాద్, ఆర్మూర్ రైతులు కూడా ఉత్తరాది రైతుల వలే పోరాడాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. చక్కెర కర్మాగారం తెరిపించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, రూ.42 కోట్ల బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. మే 9లోపు రైతుభరోసా పూర్తి చేస్తామని కేసీఆర్‌కు సవాలు విసిరానని, చెప్పిన తేదీ కంటే ముందే మే 6న రైతుభరోసా నిధులు వేసినట్లు పేర్కొన్నారు.
పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హరీశ్‌రావుతో సవాలు విసిరానని సీఎం రేవంత్ తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు అన్నారని, ఆగస్టు 15లోపు రుణమాఫీ పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో సిద్దిపేటకు హరీశ్‌రావు శని వదులుతుందని పేర్కొన్నారు. పసుపుబోర్డు తెచ్చుకోవాలంటే జీవన్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. చక్కెర పరిశ్రమను తెరిపించి చెరకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
"బీజేపీ నేత, ధర్మపురి అర్వింద్ గెలిచిన 5 నెలల్లో పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చారు. పసుపు బోర్డు తేకుండా మోసం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ఎన్నికల ముంగిట పసుపుబోర్డు ప్రకటన చేశారు. గుజరాత్, యూపీలో ప్రకటన చేస్తే, పదేళ్లు నెరవేరకుండా ఉంటుందా? నిజామాబాద్, ఆర్మూర్ రైతులు కూడా ఉత్తరాది రైతుల వలే పోరాడాలి". - రేవంత్ రెడ్డి, సీఎం
షెడ్డుకు పోయిన కారును తూకానికి అమ్మాల్సిందే : సీఎం రేవంత్‌రెడ్డి - Congress janajathara sabha gadwal