CM Revanth Reddy Review Meeting: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో వివిధ అంశాలపై కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమాలోచనలు జరిపారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోవడం ధాన్యం తడిసిపోవడంపై ఏం చేయాలనే అంశంపై చర్చించారు.
CM Revanth Reddy Review Meeting on Rithu Runa Mafi: ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సీఎం చర్చించారు. రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు వివిధ మార్గాలను చర్చించారు. రూ.2 లక్షల రుణమాఫీ కోసం విధివిధానాలు, ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలన్నారు. నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రైతు రుణమాఫీ కోసం మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది - ఇక పరిపాలనపై ఫోకస్ : సీఎం రేవంత్ - CM Revanth Reddy Chit Chat
CM Revanth Reddy on Grain purchases: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వర్షాకాలం ప్రారంభం కాకముందే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల జోక్యం లేకుండా చూడాలన్నారు. రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రానున్న సాగు సీజన్‌కు సంబంధించి ఎలా సన్నద్ధం కావాలనే విషయంపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. విత్తనాలు సిద్ధం చేయడం, నకిలీ విత్తనాలు కట్టడిపై అంశంపై చర్చించారు.