CM Revanth Reddy Helps to Orphan Girl Durga : బాలిక దుర్గకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసటగా నిలిచారు. తల్లి ఆత్మహత్యకు పాల్పడటంతో ఒంటరిగా మిగిలిపోయిన చిన్నారి దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్‌తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది.
ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్య, వైద్యం, ఇతర అవసరాలకు అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు. వైద్య, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
Minister Komatireddy Venkat Reddy Respond On Nirmal Incident : బాలిక దుర్గకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం అండగా నిలిచిన విషయం తెలిసిందే. తన ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.లక్ష నగదును తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీవో అబ్దుల్ సమద్ ద్వారా అందించారు. ఈ నగదును స్థానిక అధికారుల చేత చిన్నారికి అందించారు. దుర్గ చదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. బాలికకు ఇల్లు సైతం నిర్మిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ మేరకు స్థానిక నేతలకు వీడియో కాల్ చేసి చిన్నారి దుర్గతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా డబ్బులు పంపుతానని, త్వరలో కలుస్తానని చెప్పారు. అనాథ బాలికను ఆర్థికంగా ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ హామీ ఇచ్చారు. ఆమె విద్యాభ్యాసానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హృదయ విదారకం - నిర్జీవమైన అమ్మ - 2 రోజుల పాటు జోలిలోనే రెండేళ్ల పాప - Mother committed suicide in ap