CM Revanth Reddy On Telangana Talli Statue in Assembly : తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలు, విపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. సభ ప్రారంభంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై మాట్లాడారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం శాసనసభలో ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న విగ్రహానికి అధికారిక గుర్తింపు లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకతలను సీఎం సభకు వివరించారు. స్వరాష్ట్ర సాధన సుదీర్ఘ పోరాటంలో సకల జనుల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లిని అధికారికంగా గౌరవించుకుంటున్నామని చెప్పారు.
వారే స్ఫూర్తి : స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి అన్న ఆయన తెలంగాణ జాతికి జీవం పోసిందని తెలిపారు. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదని రూ.4కోట్ల బిడ్డల భావోద్వేగం అని చెప్పారు. భావోద్వేగాన్ని ప్రతిబింబించేలా ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపొందించిందని వివరించారు. ప్రశాంత వదనంతో నిండైన రూపంతో చాకలి ఐలమ్మ, సారలమ్మ పోరాట స్ఫూర్తి కనిపించేలా హుందాతో కనిపించేలా విగ్రహం రూపొందించినట్టు చెప్పారు.
"రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దాశరథి మాటలు నిత్య సత్యం. భూప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమే అస్తిత్వానికి మూలం సంస్కృతి దానికి ప్రతిరూపమే తెలంగాణ తల్లి. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి. తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది. నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపింది తెలంగాణ తల్లి." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు - సభ ముందుకు 5 బిల్లులు, 2 నివేదికలు
తెలంగాణ తల్లి రూపకల్పనలో సంప్రదాయం, సంస్కృతులు పరిగణలోకి తీసుకున్నామని, ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో, గుండు పూసలు, హారం, ముక్కుపుడకతో, ఆకుపచ్చ చీర , కడియాలు, మెట్టెలతో తెలంగాణ తల్లి రూపకల్పన చేసినట్లు వివరించారు. తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపేలా చేతిలో తెలంగాణ పంటలతో కనిపిస్తుందన్నారు. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణంగా నిలుస్తుందని సీఎం వివరించారు.
సాంస్కృతి పురుజ్జీవం : ఉద్యమాలు, ఆత్మ బలిదానాలకు సంకేతంగా పీఠంలో పిడికళ్లను విగ్రహాన్ని రూపొందించినట్లు తెలిపారు. విగ్రహంలో వాడిన ఒక్కో రంగు ప్రత్యేకతను చెప్పిన సీఎం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా తెలంగాణ సంక్షిప్త పేరును టీజీకి అధికారిక గుర్తింపు ఇచ్చామని తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసిన జననీ జయ జయహేను రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించామని సీఎం చెప్పారు.
మున్సిపాలిటీల్లో ఆ పంచాయతీల విలీనం ఖాయం - గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
ఈనెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు - నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్