CM Revanth Reddy on Future City Connectivity Roads : ఫ్యూచర్ సిటీకి వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాలపై ప్రణాళికలు తయారు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూసేకరణ, ఇతర అంశాలపై వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీ కోసం ప్రతిపాదించిన రూట్ మ్యాప్‌ను అధికారులు సీఎంకు వివరించారు.
అవుటర్ రింగు రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేసేలా ప్రణాళిక చేయాలని సీఎం తెలిపారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.